ప్రముఖ దర్శకులే ప్రధాన పాత్రధారులుగా ప్రేమ్‌రాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. కీర్తన మూవీ మేకర్స్
పతాకంపై టి.వెంకటేష్ యాదవ్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి
ఎన్.శంకర్ స్విచాన్ చేయగా, బి.గోపాల్ క్లాప్ ఇచ్చారు. పరుచూరి వెంకటేశ్వరరావు గౌరవ దర్శకత్వం వహించారు.
‘‘నిర్మాణాత్మకంగా, విశ్లేషాత్మకంగా, ఆలోచింపజేసేదిగా ఈ సినిమా ఉండబోతోంది. దర్శకుడు ప్రేమ్‌రాజ్... యండమూరి
‘అనైతికం’ నవలనే కథావస్తువుగా తీసుకున్నాడు.
పైగా నటనపై మక్కువ ఉన్న ఓ ఇరవై మంది దర్శకులని ప్రధాన పాత్రధారులుగా ఎంచుకున్నాడు. కేవలం ప్రయోగాల
దర్శకుడిగానే కాక, ప్రజలు మెచ్చే దర్శకుడిగా ప్రేమ్‌రాజ్ ఎదగాలి’’ అని పరుచూరి వెంకటేశ్వరరావు ఆశాభావం వ్యక్తం
చేశారు. ఎన్.శంకర్ మాట్లాడుతూ-‘‘ఇంతమంది సమర్థులను డెరైక్ట్ చేయడం పెద్ద సాహసం. యండమూరి ‘అనైతికం’
నవలను కథా వస్తువుగా ఎంచుకోవడం ఇంకా పెద్ద సాహసం. ప్రేమ్‌రాజ్ ప్రయత్నం ఓ సంచలనానికి నాంది కావాలి’’
అన్నారు. ప్రేమ్‌రాజ్ మాట్లాడుతూ- ‘‘తొలి సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడే ‘అనైతికం’ నవలను సినిమాగా చేయాలని
అనుకున్నాను. ఇంతమంది దర్శకుల సహకారం ఈ సినిమా నిర్మాణంలో నాకుంటుందని నా నమ్మకం.
ఈ నెల 20 నుంచి పదిహేను రోజుల పాటు తొలి షెడ్యూల్ జరుగుతుంది. వచ్చే నెలలో జరిగే రెండో షెడ్యూల్‌తో సినిమా
పూర్తవుతుంది’’అన్నారు. రవిబాబు, ఎన్.శంకర్, పరుచూరి వెంకటేశ్వరరావు, వీఎన్ ఆదిత్య, కాశీవిశ్వనాథ్, చంద్రమహేష్,
సాగర్, రాంప్రసాద్, ఎమ్మెస్ నారాయణ, ఏవీఎస్, దేవీప్రసాద్, కాదంబరి కిరణ్ తదితర దర్శకులు ఇతర పాత్రలు పోషిస్తున్న
ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: యశోకృష్ణ, కెమెరా: డీజీ వెంకటేష్, సమర్పణ: సత్యనారాయణరెడ్డి.