Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
దాసరి - బాలకృష్ణల 'పరమవీరచక్ర'
      మహానటుడు ఎన్టీఆర్‌ హీరోగా సర్దార్‌ పాపారాయుడు, బొబ్బిలిపులివంటి సంచలనాత్మక చిత్రాలను అందించిన డా. దాసరి నారాయణరావు తాజాగా బాలకృష్ణ హీరోగా తన 150వ చిత్రం చేయబోతున్నారు. తేజ సినిమా పతాకంపై ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్‌ నిర్మించనున్నారు. దీనికి 'పరమవీరచక్ర' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రవిశేషాలను తెలియజేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ - "దాసరిగారి 150వ చిత్రంలో హీరోగా నటించడం ఆనందంగా ఉంది. దాసరి, నాలో ఆవేశం, అమాయకత్వం రెండూ ఉన్నాయి. కార్మికుల్లా కష్టపడి సినిమా చేస్తాం. మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే ప్రేక్షకులు, అభిమానులు ఏ స్థాయిలో ఊహించుకుంటారో ఆ స్థాయికి తగ్గకుండా ఈ చిత్రం ఉంటుంది' అన్నారు.

దాసరి మాట్లాడుతూ - "సీహెచ్‌ నారాయణ, ఎన్టీఆర్‌, నాగార్జున.. ఇలా అందరితో సినిమా చేశాను కానీ బాలయ్యతో చేయలేదు. బహుశా నా 150 సినిమా మా కాంబినేషన్‌ కుదరడానికే ఇన్నాళ్లు ఆగిందేమో. ఎన్టీఆర్‌తో సినిమా తీసినప్పుడు ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఎలాంటి సినిమా కావాలని కోరుకున్నారో అలాంటిదే చేశాను. ఇప్పుడు బాలయ్యతో కూడా అలానే చేస్తాను. ఈ కథలో చేస్తే మహానటుడు ఎన్టీఆర్‌ చేయాలి. ఆ తర్వాత బాలయ్యే చేయాలి. ఒకానొక సమయంలో ఈ ఔట్‌లైన్‌ రజనీకాంత్‌ విని తనకు కావాలన్నారు. కానీ తెలుగులో చేయాలని ఉందని చెప్పాను. చరిత్రలో నిలిచిపోయే పాత్రను ఇందులో బాలయ్య చేయబోతున్నాడు. బాలయ్య సంక్రాంతి హీరో కాబట్టి ఆ పండగకి ఈ సినిమాని విడుదల చేస్తాం' అన్నారు. "బాలయ్య పుట్టినరోజుని పురస్కరించుకుని జూన్‌ 10న ఈ చిత్రం షూటింగ్‌ను ఆరంభిస్తాం. మా గురువుగారు (దాసరి) నాకిచ్చిన మంచి బహుమతి ఇది' అని కళ్యాణ్‌ తెలిపారు. ఈ సమావేశంలో చిత్ర సహనిర్మాత సీవీ రావు కూడా పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎస్‌.రమేష్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com