కుటుంబ కథా చిత్రాల హీరో అనే పేరు సంపాదించుకోవడంతో పాటు మాస్ హీరో అని కూడా అనిపించుకున్న శ్రీకాంత్ ఇప్పటివరకు చేయనటువంటి పాత్రను ‘దేవరాయ’లో చేయబోతున్నారు. సన్‌రే ఇంటర్నేషనల్ సినిమా పతాకంపై కిరణ్ జక్కంశెట్టితో కలిసి నానికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించడంతోపాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఆరంభమైన ఈ చిత్రం తొలి దృశ్యానికి ఛోటా కె నాయుడు కెమెరా స్విచాన్ చేయగా, రామ్‌చరణ్ క్లాప్ ఇచ్చారు. వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘ఇందులో శ్రీకృష్ణదేవరాయలు, దొరబాబుగా రెండు పాత్రలు చేస్తున్నాను. 1500 సంవత్సరాల క్రితం జరిగిన కథను తీసుకుని ఈ చిత్రాన్ని చేస్తున్నాం. ముందుగా ఈ కథ విన్నప్పుడు చేయగలనా? అనుకున్నాను. అయితే ఇటీవల ‘శ్రీరామరాజ్యం’ చేయడంవల్ల ఈ సినిమాలో యాక్ట్ చేయగలననే నమ్మకం కుదిరింది’’ అన్నారు.
చక్రి మాట్లాడుతూ -‘‘ఇలాంటి చిత్రం చేయడం నాకిదే మొదటిసారి. ఆనాటి బ్యాక్‌డ్రాప్‌ని దృష్టిలో పెట్టుకుని పాటలు చేయాల్సి ఉంటుంది. బ్యాగ్రౌండ్ స్కోర్‌కి కూడా ప్రాధాన్యం ఉన్న సినిమా’’ అని చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ -‘‘గోదావరి గలగలలు, విజయనగర వైభవాన్ని అనుసంధానం చేసి తయారు చేసిన కథ ఇది. శ్రీకృష్ణదేవరాయలు ఔన్నత్యాన్ని, శౌర్యాన్ని చెప్పే చిత్రం’’ అన్నారు.
‘‘ఇది అద్భుతమైన కథ. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌పరంగా సినిమా గ్రాండ్‌గా ఉంటుంది. సెప్టెంబర్ 13న షూటింగ్ ఆరంభించి మూడు షెడ్యూల్స్‌లో పూర్తి చేస్తాం’’ అని కిరణ్ చెప్పారు. ఈ చిత్రానికి మాటలు అందించడంపట్ల వీరబాబు బాసిన ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రవిరెడ్డి మల్లు.