సర్వేజన సుఖినోభవంతు ఫిలింస్ పతాకంపై జనార్థన మహర్షి దర్శకత్వంలో శ్రావణి, శర్వాణి నిర్మిస్తున్న చిత్రం ‘దేవస్థానం’. కళాతపస్వి
కె.విశ్వనాథ్ ప్రధానపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో గానగంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం-ఆమని భార్యాభర్తలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం
విశేషాలను తెలిపేందుకు హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. సంగీతదర్శకుడు స్వరవీణాపాణి, ఛాయాగ్రాహకుడు
సురేష్.ఎన్.వి.కుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కె.విశ్వనాథ్ మాట్లాడుతూ- ‘కొత్తదనం నిండిన ఆలోచన, కథా వస్తువులో వైవిధ్యం ఆకర్షించడం వల్లే ఈ చిత్రంలో నటిస్తున్నా.
దర్శకునిలోని పరిపక్వతే నన్ను మరోసారి నటించేలా చేసింది. ఈ చిత్రంలో ఏకాకి పాత్రలో కనిపిస్తున్నా. బాలు-ఆమని జంట చుట్టూనే కథ
తిరుగుతుంది. చిన్న చిన్న బతుకుల్లో ఆటుపోట్లు ఎలా ఉంటాయో దర్శకుడు చక్కగా చూపిస్తున్నారు. విలక్షణం, ఆహ్లదం అనిపించే
చిత్రమిది’ అన్నారు.
దర్శకుడు జనార్థన మహర్షి మాట్లాడుతూ- ‘విశ్వనాథ్ గారి దగ్గర ఒక సినిమాకైనా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయాలనుకునేవాడిని. ఈరోజు
ఆయన్నే ప్రధాన పాత్రధారునిగా పెటి్ట సినిమా తీయడం నా అదృష్టం. స్వరవీణాపాణి సమకూర్చిన సంగీతం హృదయాన్ని హత్తుకునే
విధంగా వుంటుంది. డిసెంబర్ 16న ఆడియో, జనవరి 26న సినిమా విడుదల చేస్తాం’ అన్నారు.
ఆమని మాట్లాడుతూ- ‘దర్శకుడు. విశ్వనాథ్, బాలు వంటి దిగ్గజాలతో పనిచేయడం ఆనందాన్నిచ్చింది. జనార్థన్ మొదటి సినిమా
అయినప్పటికీ మంచి కథను ఎంచుకుని బాగా తీశారని’ తెలిపారు.
డా.కె.విశ్వనాథ్, డా. ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఆమని, కొవై సరళ, నాయక్‌రామన్, శ్రీసంధ్య, నీహారిక తదితరులు ఈ చిత్రంలో
నటిస్తున్నారు. కెమెరా: సురేష్‌కుమార్, సంగీతం: స్వరవీణాపాణి. ఎడిటింగ్: రమేష్.కె, కళ: శ్రీను, నిర్మాతలు: శ్రావణి, శర్వాణి, దర్శకత్వం:
కె.జనార్థన్ మహర్షి.