వెండితెరపై పలు విలక్షణమైన పాత్రలకు, సలక్షణంగా ప్రాణ ప్రతిష్ఠ చేసిన జాతీయ ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్. ఉత్త నాణ్యతతో, అర్థవంతమైన చిత్రాలను
నిర్మించటానికి కట్టుబడిన ‘డ్యూయెట్ మూవీస్’ ప్రకాష్ రాజ్ స్వంత చిత్ర నిర్మాణ సంస్థ. దక్షిణ భారత చలన చిత్రరంగంలో ఇది ప్రముఖ నిర్మాణ సంస్థగా
ఆవిర్భవించింది.
‘డ్యూయెట్ మూవీస్’ పతాకంపై తాజాగా ఆయన నటిస్తూ, నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ధోని’. ఇందులో ప్రముఖ దర్శకుడు పూరీ
జగన్నాథ్ తనయుడు ‘ఆకాశ్’ ఓ ముఖ్య పాత్రను పోషిస్తుండటం విశేషం.
నిర్మాతగా ప్రకాష్ రాజ్ పయనం అర్థవంతమైనది. ‘మొళి, అభియుమ్ నానుకు (తెలుగు లో ‘ఆకాశమంత’), వెల్లిధిరై, ఇనిదు ఇనిదు, పయనం
(తెలుగులో ‘గగనం’) వంటి చిత్రాలు మొదలుకొని ఇటీవల జాతీయ అవార్ట్ గెల్చుకున్న ‘పుట్టక్కన హినే’ (కన్నడ) వరకు ఉత్తమ చిత్రాల నిర్మాతగా
ప్రకాష్ రాజ్ చాలా దూరం ప్రయాణించారు. ఐదు పర్యాయాలు ఉత్తమ నటుడి అవార్డ్ అందుకున్న ఆయన దర్శకత్వ రంగంలో తొలి ప్రయత్నంగా కన్నడ
చిత్రం ‘నాను నన్నకనసు’కు నిర్దేశకత్వం వహించారు. తాజాగా ఇప్పుడు ‘ధోని’ చిత్రం ద్వరా తెలుగు, తమిళ చిత్ర సీమల్లో కూడా దర్శకత్వ రంగంలోకి
అడుగు పెడుతున్నారు.
విద్యా వ్యవస్థ తీరుతెన్నులు గురించి చర్చించే చిత్రం :
ఇక చిత్ర కథ విషయానికి వస్తే... ‘ప్రకాష్ రాజ్ మధ్యతరగతి సముద్రాన్ని ఈదుతున్న సగటు మనిషి. ప్రొద్దున్న గవర్నమెంట్ ఆఫీస్ లో గుమాస్తాగిరి.
సాయంత్రం పచ్చళ్ళ వ్యాపారంతో పైసాపైసా కూడబెడుతూ ‘బడ్జెట్’ ప్రకారం జీవితాన్ని గడుపుతూవుండాటు. రోజంతా తన ఇద్దరు పిల్లల భవిష్యత్ గురించి
కలలు కంటూ వుంటాడు. కొడుకు కార్తీక్ (ఆకాష్)ని ఎం.బి.ఎ చదివించాలన్నది అతని జీవితంలో మిగిలిన ఒకే ఒక్క కల. కార్తీక్ చదువు కంటే ఆటలపై
మక్కువ ఎక్కు. క్రికెట్ అంటే మరీ... లెక్కల్లో సున్నా వచ్చినా... మైదానంలోకి దిగితే సిక్స్ కొట్టగలడు. కార్తీక్ తండ్రి మాట విని బాగా
చదువుకున్నాడా...? లేక ‘ధోని’లా మారాడా..? ఇదీ క్లుప్తంగా కథ.
చదువు అంటే లెక్కలు, సైన్స్, జాగ్రఫీ కాదు... పిల్లలు వాటికే పరిమితం కాకూడదు. మనిషిని ఈ విద్యావ్యవస్థ వస్తువుల్ని తయారు చేసే
యంత్రాలుగా మారుస్తోంది. వాళ్ళ ఆశలకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే... అదే ఈ సినిమాలో చెప్పడం జరుగుతోందని చిత్ర
నిర్దేశకుడు ప్రకాష్ రాజ్ తెలిపారు. ‘ధోని’లో మధ్యతరగతి జీవితాన్ని కష్టాలతో, కన్నీళ్ళతో ముడిపెట్టి చూపకుండా సన్నివేశానుసారం సరదాగా సాగేలా
చూపించే ప్రయత్నం చేశాం. చదువు విషయంలో ఇటు పిల్లలు అటు తల్లి దండ్రులకు వుండాల్సిన అవగాహనను, నాకున్న అనుభవంతో ఎదురైన
సంఘటనల నేపధ్యంలో బాధ్యతగా చెప్పే ప్రయత్నం చేశానని తెలిపారు ప్రకాష్ రాజ్.
స్వర మాంత్రికుడు ‘మాస్ట్రో’ ఇళయరాజా ఈ చిత్రానికి సంగీం సమకూరుస్తుండగా, సుప్రసిద్ధ గీతరచయిత ‘సిరివెన్నెల సీతా రామశాస్త్రి’ సాహిత్య
అందిస్తున్నారు. ఇళయరాజా ఈ సినిమా కోసం అన్ని గీతాలను లైన్ రికార్డింగ్ చేశారు.
‘ధోని’ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ఈ నెలలోనే చిత్ర ఆడియో, ఫిబ్రవరి నెలలో ‘ధోని’ని ప్రేక్షకుల ముందుకు
తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు.
‘ధోని’లొ ఇతర ముఖ్య భూమికల్ని ‘రాధిక ఆప్టే’, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, నాజర్, మెల్కోటె, అనంత్, హేమ, మురళి శర్మ, కస్తూరిహరి,
శ్రీతేజ పోషిస్తున్నారు. సంగీతం : ఇళయరాజా, పాటలు : సిరివెన్నెల సీతారామశాస్త్రి, మాటలు : టి.జె.జానవేల్, మహేష్ రాజా, కెమెరా : కె.వి.గుహేన్,
ఆర్ట్ : కె.కదిర్, ఎడిటర్ : కిషోర్ (జాతీయ అవార్డ్ గ్రహీత), బ్యానర్ : డ్యూయెట్ మూవీస్, నిర్మాత- దర్శకత్వం : ప్రకాష్ రాజ్.