రవితేజ స్వతహాగా అమితాబ్ అభిమాని. హీరో అవ్వాలన్న ఆశ ఆయనలో మొగ్గ తొడిగింది అమితాబ్ సినిమాలు చూసే. ఇప్పుడాయన దాదాపు తన నిజజీవిత పాత్రనే 'డాన్‌శీను' సినిమాలో చేశారు. కాకపోతే.. రవితేజ నిజజీవితంలో అమితాబ్‌లా హీరో అవ్వాలనుకున్నారు. ఈ సినిమాలో మాత్రం అమితాబ్ 'డాన్' సినిమా చూసి తాను కూడా ఓ డాన్‌గా మారాలనుకుంటాడు. ఈ సినిమా ఎలా ఉంటుందో ఓ అంచనాకు రావడానికి ఈ ఒక్క పాయింట్ చాలు. రవితేజకు సరిగ్గా సరిపోయే టైటిల్‌తో, కథ, కథనాలతో రూపొందుతున్న 'డాన్ శీను' చిత్రం బుధవారంతో షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర సమర్పకుడు అచ్చిరెడ్డి మాట్లాడుతూ -"షూటింగ్ పూర్తయింది. ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. ఆడియోలాగే సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుందని మా నమ్మకం. రవితేజతో 'కిక్' తర్వాత చేస్తున్న సినిమా అవ్వడంతో సినిమాపై అంచనాలు తారస్థాయిలో ఉంటాయి. కాబట్టి ఆ అంచనాలను అందుకునే విధంగా మంచి కథను, మంచి దర్శకుడ్ని, ప్రతిభగల సాంకేతిక నిపుణులను ఎన్నుకొని ఈ సినిమా చేశాం. సహనిర్మాత సురేష్‌రెడ్డి ఈ సినిమా విషయంలో చూపించిన చొరవ అభినందనీయం. ఇక దర్శకుడు గోపిచంద్ మలినేని ఏ విషయంలోనూ కంగారు పడకుండా, తపనతో ఈ సినిమా చేశాడు.
నిర్మాణానంతర పనులు ముగించుకొని ఆగస్ట్ 6న సినిమాను విడుదల చేస్తాం' అని తెలిపారు. "నటుడిగా నాకు పూర్తి సంతృప్తినిచ్చిన పాత్ర ఇది. కథను నాకు చెప్పిన దానికంటే గొప్పగా తీశాడు గోపి. 'ఢీ' చిత్రంలోని పాత్ర ఎంతటి పేరు తెచ్చిందో ఆ స్థాయి గుర్తింపునిచ్చే పాత్ర ఇది. మళ్లీ వందరోజుల వేడుకలో మాట్లాడతా' అని డా.శ్రీహరి చెప్పారు. ఇంకా దర్శకుడు గోపిచంద్ మలినేని, సహ నిర్మాత సురేష్‌రెడ్డి, మహేష్ మంజ్రేకర్, అలీ, బెనర్జీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. శ్రియ కథానాయికగా చేసిన ఈ సినిమాలో డా.బ్రహ్మానందం, సయాజీ షిండే, వేణుమాధవ్, బ్రహ్మాజీ, యాష్‌పాల్ శర్మ తదితరులు కూడా ఇతర పాత్రలు చేశారు.
ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్, ఎడిటింగ్: గౌతంరాజు, కో-డైరెక్టర్: తరణీరావు, కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: మణిశర్మ, కథ, స్కీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని, నిర్మాత: వెంకట్, నిర్మాణం: ఆర్.ఆర్.మూవీమేకర్స్.