పోసాని కృష్ణమురళి దర్శకత్వంలో శ్రీకాంత్ కథానాయకుడిగా లాఫింగ్ లార్డ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మురళీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘దుశ్శాసన’. ఈ చిత్రంలో సంజన, తషుకౌశిక్ కథానాయికలు. ప్రస్తుతం ఈ సినిమా డిటిఎస్ మిక్సింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సినిమా గురించి దర్శకుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ- ‘దుశ్శాసనుడంటే మొండివాడు. తప్పు ఒప్పుల గురించి ఆలోచించకుండా చెప్పింది చేసేవాడు. వలువలు ఊడదీయడమేకాదు... అవసరమైతే... వ్యవస్థ ప్రక్షాళనకైనా వెనుకాడనివాడు. ఇందులో శ్రీకాంత్ పాత్ర చిత్రణ అలాగే వుంటుంది. ఆయనతో చేసిన ‘ఆపరేషన్ దుర్యోధన’ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. ఈ ‘దుశ్శాసన’ దాన్ని మించే స్థాయిలో వుంటుంది. వ్యవస్థలో మార్పును కాంక్షిస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. ప్రస్తుత సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఓ ముఖ్య సమస్యకు పరిష్కారాన్ని చెబుతూ ఈ సినిమా తెరకెక్కించాం. శ్రీకాంత్ పాత్ర ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. సంజన, తషుకౌశిక్ పాత్రలు కూడా కథలో కీలకమైనవి. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే తొలి కాపీ వస్తుంది. మే 13న చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ- ‘ఒక మంచి సినిమాకు నిర్మాతను అయినందుకు గర్వపడుతున్నాను. పోసాని యజ్ఞంలా సినిమాను మలిచారు. శ్రీకాంత్ కి ఈ సినిమా ద్వారా అవార్డు రావడం ఖాయం’ అన్నారు.
ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, చలపతిరావు, తనికెళ్ళ భరణి, అంబికాకృష్ణ, ఫైజల్ ఖాన్, శిల్ప, శివాజీరాజా తదితరులు నటించగా, కెమెరా : ఎ.రాజా, సంగీతం : ఎం.ఎం.శ్రీలేఖ, ఎడిటింగ్: మోహన్-రామారావు, ఆర్ట్: విజయ్ కృష్ణ.