తనీష్ కథానాయకుడిగా ఈతరం ఫిలిమ్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రణీత కథానాయికగా పరిచయమవుతోంది. ఎ.ఎస్.రవికుమార్‌చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. పోకూరి బాబూరావు నిర్మాత. ఈ సినిమాకి 'ఏం పిల్లో.. ఏం పిల్లడో' అనే పేరుని ఖరారు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటైన ఓ కార్యక్రమంలో నిర్మాత మాట్లాడుతూ- ''మా సంస్థ నుంచి వస్తున్న కొత్త తరహా చిత్రమిది. మా అబ్బాయి ప్రశాంత్ నిర్మాణంలో సహకారాన్ని అందించాడు. ఆద్యంతం యువతకు నచ్చేలా ఉంటుంది. భావోద్వేగాలకూ పెద్దపీట వేశాం. త్వరలోనే పాటలను పూర్తి చేసి వేసవికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఫైట్‌మాస్టర్లు రామ్-లక్ష్మణ్‌ల అన్న కొడుకు వెంకట్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించాడ''న్నారు.
దర్శకుడు మాట్లాడుతూ- ''నాకు మాతృసంస్థ ఈతరం ఫిలిమ్స్. ఇందులో మరో అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. హీరో హీరోయిన్ల పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. నేటితరాన్ని ప్రతిబింబించేలా ఉంటుందీ సినిమా. పూర్తి వినోదాత్మకంగా ఉంటూ యువతను, కుటుంబ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంద''న్నారు.
ఈ చిత్రంలో చంద్రమోహన్, చరణ్‌రాజ్, ఆహుతి ప్రసాద్, డా||శివప్రసాద్, విజయ్‌చందర్, రవిశంకర్, రమాప్రభ, రజిత, ప్రగతి, స్వాతి తదితరులు నటించారు. మాటలు: భాషాశ్రీ, పాటలు: భాస్కరభట్ల, రామజోగయ్యశాస్త్రి, భాషాశ్రీ, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సిహెచ్.రమణరాజు, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: పోకూరి రామారావు.