రామ్, తమన్నా జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ నిర్మిస్తున్న ‘ఎందుకంటే... ప్రేమంట’
చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. రామ్, తమన్నాలపై చిత్రీకరించిన తొలి దృశ్యానికి డి.సురేష్‌బాబు
కెమెరా స్విచాన్ చేయగా, విజయభాస్కర్ క్లాప్ ఇచ్చారు. ఈ సన్నివేశానికి సుకుమార్ గౌరవ దర్శకత్వం
వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ -‘‘మన జీవితంలో
జరిగే ఎన్నో సంఘటనలకు సమాధానం దొరకదు. అలాంటప్పుడు అంతా దైవలీల అనుకుంటాం. ఓ యువతీ
యువకుడు మాత్రం తమ మధ్య జరిగే సంఘటనలను ‘ప్రేమ’గా భావిస్తారు. కరుణాకరన్ చాలా సెన్సిటివ్. ‘తొలి
ప్రేమ’ నుంచి ‘డార్లింగ్’ వరకు తన సినిమాలన్నీ సున్నితంగా ఉంటాయి.
ఇది ఓ అందమైన ప్రేమకథ. మామూలుగా ఇప్పటివరకు రామ్ చేసిన చిత్రాలను చూసి ‘ఇలాంటి కుర్రాడు
మనింట్లో ఉంటే బాగుంటుంది’ అనుకునేవారు. కానీ ఈ సినిమాలో మాత్రం తన పాత్రని చూసి.. ఇలాంటి కుర్రాడు
వద్దు అనుకుంటారు. తన పాత్ర అంత అల్లరిగా ఉంటుంది’’ అన్నారు. రామ్ మాట్లాడుతూ -‘‘ఇలాంటి దర్శకుడు,
నిర్మాత, రచయిత, నటీనటులు, సాంకేతిక నిపుణులతో పని చేయాలని కొంతమందిని చూసినప్పుడు అనిపిస్తుంది.
అలా నేను ఎవరెవర్ని అనుకున్నానో వారందరితో కలిసి నా హోమ్ బేనర్‌లో ఈ చిత్రం చేయడం ఆనందంగా
ఉంది. నేను కరుణాకరన్‌గారికి అభిమానిని. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఇందులో కోన వెంకట్ విలన్‌గా నటిస్తున్నారు’’
అన్నారు.
‘‘ఈ సంస్థ నిర్మించిన ‘రెడీ’లో చిన్న రోల్ చేశాను. ఆ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ఒక రోజులో ముగిసింది. ఈ
సంస్థలో కథానాయికగా చేసే అవకాశం వస్తే బాగుంటుందన్న నా కోరిక ఈ చిత్రంతో తీరుతోంది’’ అని తమన్నా
అన్నారు. రవికిషోర్ మాట్లాడుతూ -‘‘గత ఏడాది జూలైలో కరుణాకరన్... ఈ చిత్రానికి సంబంధించిన 40
సన్నివేశాలను చెప్పారు. చాలా బాగున్నాయనిపించింది. కానీ మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు
సంపూర్ణంగా సిద్ధం చేసుకున్న తర్వాత సినిమాని ఆరంభిద్దామని, 9 నెలలు టైమ్ కావాలని అడిగారు
కరుణాకరన్.
ఆయనకు ఉన్న నిబద్దతకు నిదర్శనం ఇది. జూలైలో రెగ్యులర్ షూటింగ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు:
కోన వెంకట్, పాటలు: రామజోగయ్య శాస్ర్తి, శ్రీమణి, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్, కెమెరా: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్:
కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: పీటర్ హెయిన్స్, సమర్పణ: పి.కృష్ణచైతన్య.