వెల్ఫేర్ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'ఫేస్‌బుక్'. డా. మళ్ళ విజయప్రసాద్ నిర్మాత. ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. నిశ్చల్, ఉదయ్, సూర్య, జెమిని సురేష్, అర్చనా శర్మ, నిషాశెట్టి, ప్రీతి కీలక పాత్రధారులు.
ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ- "ఆర్పీ పట్నాయక్ ఈ కథ చెప్పగానే మనం చేస్తున్నాం అన్నాను. ఎందుకంటే ఈ చిత్రంలో మంచి సందేశం ఉంది. మాసంస్థలో వచ్చిన అన్ని చిత్రాలు సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చినవే.వెల్ఫేర్ క్రియేషన్స్ అంటేనే ప్రేక్షకులకు ఓ నమ్మకంది. ఈ రోజుల్లో యువతపై అత్యంత ప్రభావం చూపే సోషల్ నెట్‌వర్క్‌లో ముందుండే 'ఫేస్‌బుక్' ప్రధానాంశంగా చిత్రం తెరకెక్కింది. గోప్యంగా చిత్రీకరించాం. ఫేస్‌బుక్ ఏమిటి? ఇందులో స్నేహాలు మంచివా? చెడ్డవా? అవి ఎటువైపు దారితీస్తాయి అనేది కథాంశం. ఆర్పీ పట్నాయక్ చక్కగా తెరకెక్కించారు'' అని అన్నారు.
ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ "నిర్మాతను నాకు పరిచయం చేసిన రమణమూర్తికి, సూర్యారావుకు కృతజ్ఞతలు. మా నిర్మాత కథ వినగానే ఒప్పుకున్నారు. మే 10న స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాం. జూన్ 27న షూటింగ్ ప్రారంభమైంది. 47 రోజుల్లో ప్రీ ప్రొడక్షన్ చేశాం. అడిగిందల్లా నిర్మాత సమకూర్చారు. ఫేస్‌బుక్ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం ఐదారు రెట్లు ఫేస్‌బుక్ యూజర్స్‌ను పెంచుతుంది''అని అన్నారు.
"ఆర్.పి.పట్నాయక్ బహుముఖ ప్రజ్ఞాశాలి. 'ఫేస్‌బుక్' టైటిల్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్లు మెప్పించాయి. ఈ సినిమా విజయవంతం కావాలి'' అని అమ్మిరాజు, భీమినేని శ్రీనివాసరావు, వి.వి.వినాయక్, మెహర్ రమేష్, కె.ఎస్.రామారావు, చలపతిరావు, దశరథ్, పాయల్ తదితరులు ఆకాంక్షించారు.