’గణేష్’గా రామ్
     'లంబోదర.. అంబాసుత...' అని పాడుతూ తన గ్యాంగ్‌తో హైదరాబాద్‌లోని ఒక వినాయకుడి ప్రతిమ ముందు రామ్‌ చిందేశారు. రామ్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా రూపొందుతున్న 'గణేష్‌' సినిమాలో వినాయక చవితి పండగ ఎపిసోడ్‌ ఉంది. ఆ సందర్భంలో వచ్చే పాటకోసం రామ్‌ డాన్స్‌ చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను భారీ ఎత్తున చిత్రీకరించారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో చిత్రనిర్మాత రవికిషోర్‌ మాట్లాడుతూ - "మా 'స్రవంతి మూవీస్‌' నుంచి వస్తోన్న 30వ చిత్రం ఇది. ఒక పాట మినహా షూటింగ్‌ పూర్తయింది. దసరా కానుకగా విడుదల చేయాలనుకుంటున్నాం. మంచి ప్రేమకథ, చక్కని ఎమోషన్స్‌.. ఇలా అందరికీ నచ్చే అన్ని అంశాల సమాహారంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మిక్కీ జె.మేయర్‌ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ చిత్రంతో కమర్షియల్‌గా తనకి మంచి బ్రేక్‌ వస్తుంది. 'బాల రామాయణం'లాంటి సోషియో ఫాంటసీ చిత్రాలను మినహాయిస్తే 'అంజలి' తర్వాత ఈ చిత్రంలో ఎక్కువమంది పిల్లలు ఉన్నారు. ప్రధానంగా ఇది ప్రేమకథా చిత్రమైనప్పటికీ పిల్లలకి కావల్సిన చక్కని సందేశం కూడా ఉంది. దర్శకుడు శరవణన్‌ చిత్రాన్ని చక్కగా తెరకెక్కిస్తున్నారు' అన్నారు. "స్రవంతి నా మాతృసంస్థ లాంటిది. చక్కని కథతో తీస్తున్న ఈ చిత్రంలో రామ్‌, పిల్లల మధ్య సాగే సన్నివేశాలు రసవత్తరంగా ఉంటాయి. రామ్‌ అద్భుతంగా నటిస్తున్నారు. మంచి మాటలు ఇవ్వడానికి స్కోప్‌ ఉన్న కథ ఇది' అని అబ్బూరి రవి చెప్పారు. "మామూలుగా కమర్షియల్‌ సినిమాల్లో భక్తి పాటలకు ఆస్కారం ఉండదు. కానీ, ఈ చిత్రంలో మిగతా పాటలతో పాటు భక్తి పాట రాసే అవకాశం లభించడం ఆనందంగా వుంది. ఈ చిత్రానికి ఐదు పాటలు రాశాను’ అని రామజోగయ్య శాస్త్రి అన్నారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com