'సొంతవూరు' చిత్రం తర్వాత మళ్లీ ఓ విభిన్న చిత్రం చేయాలని 'గంగపుత్రులు' మొదలుపెట్టాం.
"విమర్శకుల ప్రశంసలు పొందిన 'సొంతవూరు' చిత్రం తర్వాత మళ్లీ అదే తరహాలో ఓ విభిన్న చిత్రం చేయాలని 'గంగపుత్రులు' మొదలుపెట్టాం. ప్రపంచవ్యాప్తంగా మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయాల గురించి ఇందులో చర్చిస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నాం. అత్యాధునిక 'రెడ్' కెమెరా ఉపయోగిస్తున్నాం' అని పి.సునీల్‌కుమార్ రెడ్డి చెప్పారు.
ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గంగపుత్రులు'. కె.బి.ఆర్.ప్రొడక్షన్స్, శ్రావ్య ఫిలింస్ సంయుక్త నిర్మాణంలో కిషోరి బసిరెడ్డి, యెక్కలి రవీంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్బరాజు, గాయత్రి, రావు రమేష్, ఎల్బీ శ్రీరామ్, రామకృష్ణ ఇందులో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం యూనిట్ సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -"వైజాగ్‌లో రెండు షెడ్యూల్స్ చేశాం.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆఖరి షెడ్యూలు చేస్తున్నాం. సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం' అని తెలిపారు. ఇందులో జర్నలిస్టుగా నటిస్తున్నానని గాయత్రి చెప్పారు. ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ -"విభిన్నంగా ఏదో చేయాలని తపిస్తున్న సమయంలో సునీల్‌కుమార్‌రెడ్డి పరిచయమయ్యారు. 'సొంతవూరు'లో ముఖ్యపాత చేసిన నేను, ఇందులో ఒకే ఒక్క సన్నివేశంలో నటిస్తున్నాను' అని అన్నారు. ఇందులో మొగలిపువ్వులాంటి సెటైర్ ఉంటుందని గుండు సుదర్శన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా జెన్నీ, రామకృష్ణ, కెమెరామన్ సాబు జేమ్ మాట్లాడారు.