అతను తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకుని కొడుకు. జీన్స్‌లో ఉండే పవిత్రమైన భక్తితోపాటు ఆయనలో మరో కోణం దాగి ఉంది. అది ఏమిటనేది 'జీనియన్స్' చిత్రంలో చూడాల్సిందేనని చిత్ర కథా రచయిత చిన్నికృష్ణ అన్నారు. 'వాంటెడ్ పట్టిస్తే పదివేలు' అనేది కాప్షన్. ఏడాదినాడు తను రాసుకున్న కథను ఇప్పటికి కొలిక్కి తెచ్చారు. టీవీ రంగానికిచెందిన ఓంకార్ తొలిసారిగా దర్శకునిగా పరిచయమవుతున్నారు. 'నువ్విలా'లో నటించిన హవీష్ టైటిల్‌రోల్ ప్లే చేస్తున్నాడు. మరో కీలకపాత్రను ఓంకార్ సోదరుడు అశ్విన్ పోషిస్తున్నాడు. కథానాయికగా తమిళనటి సానుషా పోషిస్తుంది. జీనియస్ చిత్రం బుధవారం రామానాయుడు స్టూడియోలో అంగరంగవైభవంగా ప్రారంభమైంది. ముహూర్తపుషాట్‌కు దర్శకుడు వినాయక్ క్లాప్ ఇవ్వగా, డా|| డి.రామానాయుడు కెమేరా స్విచ్చాన్ చేశారు. బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు.
చిత్రం గురించి చిన్నికృష్ణ వివరిస్తూ... 75ఏళ్ళ అన్నహజరారే స్పూర్తితో ఆయన జన్మస్థలం వెళ్ళి ఈ కథను రాశాను. మధ్యపానమో, అవినీతోకాదు అన్ని అంశాలున్న చిత్రమిది. శంకర్ చిత్రాల తరహాలో ఉంటుంది. కథ చెప్పగానే హవీష్ నేను చేయగలనా! అని అడిగాడు. నువ్విలా చూశాను. తను చేయగలడనే ధైర్యాన్ని ఇచ్చాను. యావత్‌భారతదేశం గర్వించతగ్గ సబ్జక్ట్ ఇది. ఈకథకు పరుచూరి సోదరులే చురకత్తుల్లాంటి సంభాషణలు రాయగలరు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో మొదలవుతుంది. వేసవిలో విడుదలకు సిద్ధం చేస్తున్నామని' అన్నారు.
చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ, చిన్నికృష్ణను కలిసినప్పుడు ఐదు నిముషాలు కథ విన్నాను. కథ నచ్చి నేనే చేస్తానన్నాను. బడ్జెట్ విషయంలో రాజీపడకుండా అద్భుతమైన చిత్రం తీయాలని నిర్ణయించాం. అందరూ గర్వించే చిత్రమవుతుంది అన్నారు.
దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ, ఈ చిత్రం ప్రతి విద్యార్థికీ అంకితం ఇవ్వాలనుకుంటున్నాం. విద్యార్థుల్లో తాము ఆశించిన మార్పు వస్తే అదే పదికోట్లను వ్యాఖ్యానించారు. పరుచూరి బ్రదర్స్ మాట్లాడుతూ, కథను నమ్ముకుని దమ్మున్న వారంతా చేస్తున్న చిత్రమిది. 'ఈచరిత్ర ఏ సిరాతో' రాసినప్పుడు ఎంత గర్వపడ్డామో ఇప్పుడు అంతే గర్వంగా ఉందన్నారు. ప్రముఖ పాత్రలో హైకోర్టు న్యాయవాది వరప్రసాద్ నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దివాకరన్, సంగీతం: జోస్వా శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ముత్యాల రమేష్.