ఫిలిం న్యూస్
 
 
 
 
బాలయ్య 'హరహర మహాదేవ' ప్రారంభం
బాలకృష్ణ కథానాయకుడిగా బి.గోపాల్ దర్శకత్వంలో శ్రీకాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆశ్శీస్సులతో మల్టీడైమన్షన్ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ‘హరహర మహాదేవ’ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం హైటెక్స్ లో జరిగింది. బాలకష్ణ పుట్టిన రోజు సందర్భంగా హైటెక్స్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో అభిమానుల నుండమ బాలకృష్ణ పుట్టినరోజు కేక్ కట్ చేశారు.'హర హర మహాదేవ' చిత్రం ప్రారంభోత్సవానికి సినిమాటోగ్రఫీ మంత్రి డి.కె.అరుణ పూజ చేశారు. అనంతరం బాలకృష్ణపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు అక్కినేని నాగేశ్వరరావు క్లాప్‌నివ్వగా, నందమూరి రామకృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ- 'బాలకృష్ణగారి పుట్టిన రోజున మా సినిమా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. మా బేనరులో ఆయన నటిస్తున్న మూడో చిత్రమిది. మీరంతా గర్వించే సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తా' అన్నారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ - 'ఏడేళ్ల అనంతరం బాలయ్యతో మళ్లీ కలిసి పనిచేస్తున్నాం. మంచి ఆకలి మీద ఉన్నాం. కసితో ఈ సినిమా తీస్తాం. ప్రారంభోత్సవంలో బాలయ్యబాబు చెప్పే డైలాగ్ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండాలని దర్శకుడు గోపాల్ అనడంతో ముహూర్తపు షాట్ కోసం 25 డైలాగులు రాశాను. వాటిల్లో ఒకటి బాలయ్య చెప్పారు. ఈ సినిమాలో పవర్‌ఫుల్ డైలాగులు ఎన్నో ఉన్నాయి' అంటూ కొన్ని డైలాగులు చెప్పి అభిమానులను మరింత ఉత్సాహపరిచారు.

దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ- 'బాలయ్యబాబు సినిమాలో ఏఏ అంశాలు ఉంటే బాగుంటాయో అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. అద్భుతమైన పాటలు, యాక్షన్ పార్ట్, ఆయనకు తగ్గ పవర్‌ఫుల్ పాత్రతో పాటు కావలసినంత సెంటిమెంట్ ఉండేలా ప్రయత్నిస్తున్నాం' అన్నారు.

బాలకృష్ణ మాట్లాడుతూ- 'ఏ కళాకారుడికైనా అభిమానులు చూపించే ఆదరాభిమానాలే ముఖ్యం. నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మీరందరినీ చూస్తుంటే ఇది ఏ జన్మ సుకృతమోననిపిస్తుంది. అహర్నిశలు కృషి చేసి మీరంతా గర్వపడే సినిమాలు చేస్తాను. పెద్దాయన ఆశీస్సులతో, నా అనుకునే వాళ్లంతా గర్వపడేవిధంగా చేస్తాను. ఈ సందర్భంగా నాకు జన్మనిచ్చిన తల్లితండ్రులకు, ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వచ్చే జన్మలో కూడా నటునిగానే పుట్టాలని నా కోరిక. తెలుగువాడిగా పుట్టడం, ముఖ్యంగా ఎన్టీఆర్‌కు బిడ్డగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాన్నగారు తెలుగు భాషకు, తెలుగు వారికి గౌరవం తెచ్చారు. తెలుగు భాషని ముందుకు తీసుకెళ్లడంలో నేను కూడా భాగస్వామిని అవుతాను. తెలుగుదేశం గర్వించే సినిమాలు చేస్తాను. ఇక ఈ సినిమా విషయానికి వస్తే నాతో ఎన్నో సాహసవంతమైన చిత్రాలు తీసిన దర్శకుడు గోపాల్‌గారు మళ్లీ మరో మంచి కథతో ఈ సినిమా చేస్తున్నారు. అలాగే అంకితభావంతో పనిచేసే నిర్మాత, పరిశ్రమ మేలు కోరే వ్యక్తి బెల్లంకొండ సురేష్. ఆయన చిత్రంలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది' అన్నారు.

ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, సంగీతం: తమన్, ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి.మహేంద్రబాబు, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లిమిటెడ్, నిర్మాత: బెల్లంకొండ సురేష్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి.గోపాల్.