షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘షిరిడి జై సాయిరాం’. సాయిబాబాగా తాతారెడ్డి నటిస్తున్న ఈ చిత్రాన్ని పి. భాస్కర్‌బాబా దర్శకత్వంలో పమిడిముక్కల సాయి వెంకటేశ్వరమ్మ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ - ‘‘బాబా మహిమలను తెలిపే చిత్రం ఇది. సాయి ఖండ యోగా సాధన చేసేవారనే సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు సాయిబాబా జీవిత చరిత్రతో రూపొందిన ఏ సినిమాలోనూ ఆ సాధనను చూపించలేదు. ఈ చిత్రంలో ఆ అంశాన్ని చూపించబోతున్నాం.త్వరలో సెన్సార్ పూర్తి చేసి, అక్టోబర్ రెండో వారంలో సినిమాని విడుదల చేయబోతున్నాం’’ అన్నారు. ఇప్పటివరకు ప్రముఖ నటులు పలువురు నానావలి పాత్రను చేశారు. ఈ పాత్రను నాదైన శైలిలో అందరి మెప్పు పొందే విధంగా చేశాను అని రాజ్‌కుమార్ చెప్పారు. ఈ చిత్రంలో కోట శంకర్‌రావు, సుత్తివేలు, విశ్వేశ్వరరావు, నారాయణరావు, బాలాజి తదితరులు నటించారు.
|