ఫిలిం న్యూస్
 
 
 
 
జీవా 'వచ్చాడు గెలిచాడు'

జీవా, తాప్సీ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'వచ్చాడు గెలిచాడు'. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతోంది. కె.వి.వి.సత్యనారాయణ సమర్పిస్తున్నారు. కె.వి.వేణుగోపాల్ నిర్మాత. కె.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ "ఇటీవల విడుదలైన 'రంగం' చిత్రంలో ఫొటో జర్నలిస్టుగా అందరి ప్రశంసలందుకున్న జీవా తమిళంలో నటిస్తున్న చిత్రం 'వందాన్ వెండ్రాన్'. ఈ సినిమాను మేం తెలుగులో 'వచ్చాడు గెలిచాడు' అనే పేరుతో అందిస్తున్నాం. పలు పేర్లను పరిశీలించాం. కానీ 'వచ్చాడు గెలిచాడు' కథకు అనుగుణంగా ఉంటుంది.

ఒక ఆశయాన్ని ఊపిరిగా తీసుకుని అందుకోసం ఎంతో శ్రమించి సాధించే కథానాయకుడి పాత్రను దృష్టిలో ఉంచుకుని ఈ టైటిల్‌ను ఖరారు చేశాం. ప్రస్తుతం శశాంక్ వెన్నెలకంటి డబ్బింగ్ పనులను నిర్వహిస్తున్నారు. ఈ నెల రెండో వారంలో ఓ ప్రముఖ ఆడియో కంపెనీ ద్వారా పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ "నేటి యువతకు కావాల్సిన అన్ని అంశాల్ని పొందుపరిచారు. కణ్ణన్ దర్శకత్వం మెప్పిస్తుంది. అన్ని తరగతుల ప్రేక్షకులు మెచ్చే కథనం ఉంటుంది.

స్విట్జర్లాండ్, గోవాల్లో పాటలను తీశారు. ముంబైలోని పలు ప్రాంతాల్లో కీలక దృశ్యాలను చిత్రీకరించారు'' అని చెప్పారు. నంద, సంతానం ఇతర కీలక పాత్రధారులు. మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: తమన్, సమర్పణ: కె.వి.వి.సత్యనారాయణ, నిర్మాత: కె.వి.వేణుగోపాల్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.కణ్ణన్.