ఫిలిం న్యూస్
 
 
 
 
మురుగ దాస్ 'జర్నీ'

సూపర్‌ హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన మురుగదాస్‌ మొదటిసారి నిర్మాతగా మారి హాలీవుడ్‌ సంస్థ ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోతో కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌'. తన వద్ద దర్శకత్వ శాఖలో చేసిన ఎం.శరవణన్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. శర్వానంద్‌, జై, అంజలి, అనన్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా తమిళనాట ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించి, మంచి వసూళ్ళను రాబడుతోంది. ఈ చిత్రాన్ని 3కె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లిమిటెడ్‌ సమర్పణలో ఎస్‌.కె. పిక్చర్స్‌ ద్వారా నిర్మాత సురేష్‌ కొండేటి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఈ సందర్భంగా మురుగదాస్‌ మాట్లాడుతూ 'తమిళ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఘనవిజయాన్ని చేసారు. అలాగే రేపు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకముంది. ఈ సినిమాకు కథకు తగ్గట్టుగా 'జర్నీ' అనే టైటిల్‌ని ఖరారు చేశాము. ప్రముఖ దర్శకులు శంకర్‌ తొలిసారిగా నిర్మాతగా మారి ఆయన నిర్మించిన 'కాదల్‌' చిత్రాన్ని తెలుగులో 'ప్రేమిస్తే' పేరుతో సురేష్‌ కొండేటి ప్రొడ్యూస్‌ చేశారు. అలాగే దర్శకుడిగా నాకెన్నో విజయాలున్నా నిర్మాతగా మారి చేసిన తొలి తెలుగు సినిమాని సురేష్‌ కొండేటి ప్రొడ్యూస్‌ చేయడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. 'ప్రేమిస్తే' సినిమాలాగే 'జర్నీ' సినిమా కూడా పెద్ద విజయాన్ని సాధిస్తుంది' అన్నారు.

చిత్ర సహ నిర్మాత సిహెచ్‌ ప్రద్యుమ్న మాట్లాడుతూ ''ఈ చిత్రం ఇటీవల తమిళంలో విడుదలై హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో విజయపధంలో దూసుకువెళ్తోంది. ఓ చిన్న సినిమాగా విడుదలై అన్ని థియేటర్స్‌లో వారం రోజులు పాటు అన్ని షోలు హౌస్‌ఫుల్‌ కావడం ఒక విశేషం. ఈ సినిమా చూసిన ప్రతీ ప్రేక్షకుడు ఓ కొత్త అనుభూతికి లోనవుతాడు. ఈ సినిమా ఆడియో విడుదలైనప్పుడు అన్ని పత్రికలు మరియు వెబ్‌సైట్స్‌ పాటలకు మంచి రేటింగ్‌ ఇవ్వడమే కాక, కమర్షియల్‌ ఎలిమెంట్సుతో పాటు మంచి సందేశం కూడా అందించారని కొనియాడారు. ఈ సినిమాలోని పాటలన్నీ ఏ విధమైన సెట్టింగ్స్‌ వెయ్యకుండా నేచురల్‌ లొకేషన్స్‌లో చిత్రీకరించడంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అందరూ ఈ అద్భుతమైన సినిమాకి మంచి రేటింగ్‌ ఇవ్వడం మరింత సంతోషాన్ని కలిగించింది. అలాగే తమిళ ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. అదే విధంగా త్వరలో తెలుగులో విడుదల చేయబోతున్న ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే నమ్మకముంది అన్నారు.

తెలుగు నేటివిటీతో సాగే కమర్షియల్‌ సినిమా 'జర్నీ'
గతంలో 'ప్రేమిస్తే', 'షాంపింగ్‌మాల్‌', 'నాన్న' వంటి సూపర్‌ హిట్‌ సినిమాలను తెలుగు ప్రేక్షకలకు అందించి ఉత్తమాభిరుచి గల నిర్మాతగా పేరుతెచ్చుకున్న సురేష్‌ కొండేటి తీవ్రమైన పోటీని అధిగమించి ఈ సినిమా అనువాద హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా సురేష్‌ మాట్లాడుతూ ''దర్శకుడుగా సూర్యతో 'గజిని', మెగాస్టార్‌ చిరంజీవితో 'స్టాలిన్‌' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మురుగదాస్‌ తొలిసారిగా నిర్మాతగా మారి తీసిన 'ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌' సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగులో 'ప్రేమిస్తే' తరహాలో ఈ సినిమా ఘన విజయం సాధిస్తుంది. పక్కా తెలుగు నేటివిటీతో రూపొందిన ఈ సినిమాలో మన తెలుగు హీరో శర్వానంద్‌ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. 'గమ్యం', 'ప్రస్థానం' చిత్రాల తరువాత శర్వానంద్‌కి మరో మంచి విజయాన్ని తెలుగు ప్రేక్షకులు అందించే చిత్రమిది. రెండు జంటల మధ్య సాగే ప్రేమకథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ రెండు కథలు విడివిడిగా సాగుతాయి. అయితే క్లైమాక్స్‌లో ఈ కథలకు లింకు ఉంటుంది. ఈ వారంలో డబ్బింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. మంచి కథ, ఆశక్తికరమైన కథనంతో రూపొందిన ఈ చిత్రం ఎస్‌.కె. పిక్చర్స్‌ ప్రతిష్టను మరింత పెంచే విధంగా ఉంటుంది. ఇది మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. ప్రేక్షకులు వెచ్చించే డబ్బుకి, సమయానికి పూర్తిగా న్యాయం చేసే సినిమా ఇది. అన్ని వర్గాలవారు చూడదగ్గ విధంగా ఈ చిత్రం ఉంటుంది. ఈ అందమైన ప్రేమకథా చిత్రానికి సత్య సంగీత దర్శకత్వం వహించారు. పాటలు వీనులవిందుగా ఉండటంతో పాటు కనువిందుగా కూడా ఉంటాయి. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాలను కూడా గెల్చుకుంటుందనే నమ్మకం ఉంది'' అన్నారు.

ఈ చిత్రానికి సమర్పణ: 3కె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లిమిటెడ్‌, సంగీతం: సత్య, సినిమాటోగ్రఫీ: వేల్‌రాజ్‌, నిర్మాత: సురేష్‌ కొండేటి, దర్శకత్వం: శరవణన్‌.