''స్త్రీ వేషంతో రక్తి కట్టించడం అంత సులువేమీ కాదు. ఆ పాత్ర పోషించడానికి తెరవెనుక చాలా కష్టపడ్డాను. ఒక నటుడిగా, దర్శకుడిగా నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రమిది'' అంటున్నారు లారెన్స్. 'మాస్', 'స్త్టెల్', 'డాన్' చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటిస్తూ, దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'కాంచన'. గతంలో వచ్చిన 'ముని' చిత్రానికి కొనసాగింపు ఇది. లక్ష్మీరాయ్ కథానాయిక. బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా లారెన్స్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ చెప్పిన సంగతులు ఇవీ...
''నా డ్యాన్స్ ప్రతిభేంటో 'స్త్టెల్'లో చూశారు. కొన్ని సినిమాలతో మంచి దర్శకుడు అనే పేరు కూడా వచ్చింది. ఓ మంచి నటుడుగా నిరూపించుకునే అవకాశం మాత్రం 'కాంచన' చిత్రంతో లభించింది. ఐదు సంఖ్యతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నేను దర్శకత్వం వహిస్తున్న ఐదవ చిత్రమిది. 'కాంచన' తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది''.
''ఇదివరకు చేసిన 'ముని' చిత్రంలో కొన్ని తప్పులు జరిగాయి. వాటన్నింటిని సరిచేసుకుంటూ 'కాంచన'ను తెరకెక్కించాను. సాధారణంగా హారర్ సినిమా అంటే భయం ఒకటే ఉంటుంది అనుకుంటారు. 'కాంచన' భయపెడుతూనే నవ్విస్తుంది. కొన్నిసార్లు ప్రకటన చిత్రాలు బాగుంటే సినిమాలు బాగోవు. కానీ 'కాంచన' ప్రకటన చిత్రాల కంటే కూడా ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఇందులో ఓ చక్కటి సందేశం మిళితమై ఉంది. అది సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుంది''.
'''మాస్' సినిమా చేసినపుడు నాగార్జునకు ఆ టైటిల్ సరిపోదు అన్నారు. కానీ నాగార్జునని కొత్తకోణంలో చూపించి విజయం సాధించాను. ఈ చిత్రంలో నేను స్త్రీ వేషం వేస్తున్నప్పుడు కూడా విమర్శలు వినిపించాయి. వాటన్నింటికి ఈ చిత్రం సమాధానం చెబుతుంది. స్త్రీ వేషంలో ఉన్న నన్ను నా కుటుంబ సభ్యులే కనిపెట్టలేకపోయారు. ముగింపు సన్నివేశాల్లో నేను చేసే డ్యాన్స్ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ చిత్రంలో నాయికగా మొదట అనుష్కను అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఇందులో ఓ ప్రముఖ నటుడు కూడా నటించారు. అదెవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. 'చంద్రముఖి', 'అరుంధతి' స్థాయిలో ఉండే చిత్రమిది. ఈ చిత్రానికి పాటలు ప్రధాన ఆకర్షణ. శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది.''
''ప్రతి చిత్రానికి కొనసాగింపు తీయలేం. 'ముని' చిత్రం ఆత్మలకు సంబంధించిన కథ కాబట్టి సీక్వెల్ సాధ్యమైంది. 'కాంచన' చూశాక మూడో భాగం తీయాలనే ఆలోచన వచ్చింది. అందుకు కథ కూడా సిద్ధమైంది. 'రెబల్' పూర్తయ్యాక చిత్రీకరణ మొదలుపెడతాను. 'కాంచన' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే విషయమై చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాను.''
''రెబల్' చిత్రం స్త్టెలిష్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో ప్రభాస్ కొత్తగా కనిపిస్తారు. పోరాట సన్నివేశాలు వైవిధ్యంగా ఉంటాయి. వినోదానికి ప్రాధాన్యం
ఉంది. చిత్రీకరణ పూర్తయింది.''