ఫిలిం న్యూస్
 
 
 
 
అజయ్ కుమార్ నిర్మిస్తున్న 'ఇది కథా...?'
మాతృదేవోభవ’ దర్శకుడు అజయ్‌కుమార్‌ నిర్మాతగా మారారు. శ్రీ సద్గురు సాయి ఫిలింస్‌ పతాకంపై పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న ‘ఇది కథా...?’ చిత్రం షూటింగ్‌ రామోజీ ఫిలింసిటీలో బుధవారం ప్రారంభం అయింది. ఈ చిత్రంలో ప్రధానపాత్రలు పోషిస్తున్న సంతోష్‌, యశ్వంత్‌, మానసలపై తొలి సన్నివేశాలు చిత్రీకరించారు.

ఈ సందర్భంగా అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ -‘నేను చేసిన ‘జీవితఖైదీ’ చిత్రానికి పి.చంద్రశేఖరరెడ్డి కథ ఇచ్చారు. ఆ చిత్రం నాకు మంచి పేరు తెచ్చింది. ఇటీవల పి.చంద్రశేఖరరెడ్డి నాకు ఓ మంచి కథ చెప్పారు. దానిని ఆయనే బాగా తీయగలరనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నేను నిర్మిస్తున్నాను. మన సమాజం తప్పుగా భావించే ఓ అంశాన్ని ఈ చిత్రంలో ధైర్యంగా చర్చిస్తున్నాం. ఈ విషయంలో మంచిచెడులు నిర్ణయించాల్సింది ప్రేక్షకులే. మా ఈ ప్రయత్నాన్ని అంతా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము’ అన్నారు.

దర్శకుడు పి.చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ - ఓ కొత్తపాయింట్‌తో ఈ చిత్రాన్ని చేస్తున్నాం.‘మాతృదేవోభవ’తో మంచిపేరు సంపాదించిన అజయ్‌ దీనికి నిర్మాత కావడం ఆనందంగా ఉంది. యువ దర్శకులకు ధీటుగా రూపొందిస్తాననే ధైర్యంతో ఈ చిత్రాన్ని చేస్తున్నాను’ అన్నారు.

సంతోష్, యశ్వంత్, అలేఖ్య, మానసి, రఘునాథరెడ్డి, వైజాగ్ ప్రసాద్, సత్యం రాజేష్. ఉత్తేజ్, సురేఖా వాణి, శృతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ : పి.సి.రెడ్డి, ఫోటోగ్రఫీ : టి.సురేంద్రరెడ్డి, సంగీతం : శశి ప్రీతం, ఎడిటింగ్ : కె.రవీంద్రబాబు, నిర్మాత : కె.అజయ్ కుమార్, దర్శకత్వం : పి.చంద్రశేఖర్ రెడ్డి.