Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
త్వరలో అల్లాణి శ్రీధర్ ‘కొమరమ్ భీమ్’
      తెలంగాణా ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లాలో 1935-1940 ఏళ్ళ మధ్య జరిగిన గిరిజనుల హక్కుల పోరాటం ‘కొమరం భీమ్’ సినిమా ఇతివృత్తం. గోండు గిరిజనులను చైతన్యవంతం చేసి , ఆనాటి నిరంకుశ ప్రభుత్వాన్ని గడగడ లాడించిన పోరాట వీరుడు కొమరమ్ భీమ్. స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు తమ జాతి జనులలో రగిలించిన స్ఫూర్తి కొమరమ్ భీమ్ జీవితంలో అడుగడుగునా కనిపిస్తుంది. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి అడవి బిడ్డల కష్టాలను అనుభవించిన ఒక అమాయక గిరిజనుడు.... సహజపరిణామక్రమంలో మహానాయకుడై ఎదిగి ఆనాటి అణచివేతపై తిరగబడి, చరిత్రలో అమరవీరుడిగా, ఆదర్శప్రాయుడిగా, చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన చారిత్రక కధనం - ఈ చిత్రం. ‘కొమరం భీమ్’గా భూపాల్ రెడ్డి నటించగా, ‘మా భూమి’ చిత్రానికి ఉత్తమ రచయితగా ‘నంది’ అవార్డ్ అందుకున్న సినీ నవలా రచయిత ఎస్ .యమ్. ప్రాణ్ రావు ఈ ‘కొమరం భీమ్’ చిత్రానికి రచన - సంభషణలు సమకూర్చారు. అంతర్జాతీయ దర్శకులు గౌతమ్ ఘోష్ సంగీతం ఆనాటి చారిత్రక నేపథ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది.

గోండు గిరిజనుల జీవన సంప్రదాయాన్ని, చరిత్రను, పోరాట పటిమను అడవిపై మమకారాన్ని పాటల రూపంలో అద్వితీయంగా పొందుపరిచారు భూపాల్. ఈ చిత్రం ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం , ఉత్తమ దర్శకుడు అవార్డులను గెలుచుకుని, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి విమర్శకుల ప్రశంసలు పొందింది.

ఎన్నోకారణాల వలన విడుదలకు ఆలస్యమైనా, ఇప్పుడున్న సానుకూల పరిస్ధితులలో ఈ చిత్రం విడుదల కావడం వల్ల మంచి ప్రజాధరణ పొందగలదని మా నమ్మకం అంటూ- ప్రజలసేవకు తన జీవితం అంకితం చేసిన వ్యక్తి కీ.శే. డా. పి.సుబ్రమణ్యం గారి స్ఫూరితో ఈ చిత్రం రూపొందిందని చిత్ర దర్శకుడు అల్లాణి శ్రీధర్ చెప్పారు. ఆదివాసి చిత్ర, ఫిల్మీడియా ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రాన్ని గిరిజన సంక్షేమశాఖ సహకారంతో కొమరం భీమ్ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ చలన చిత్రాభివృద్ధి సంస్ధ ద్వారా జూన్ మొదటి వారంలో విడుదలవుతోంది.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com