‘లవకుశ’ గాథ అందరికీ తెలిసిందే. ఈ ఇతిహాసగాథని నేటి బాలలకీ, పెద్దలకీ నచ్చేలా యానిమేషన్ రూపంలో తీర్చిదిద్దారు. 'లవకుశ - ది వారియర్ ట్విన్స్' అనే 2డీ చిత్రాన్ని ధవళ సత్యం దర్శకత్వంలో ది కాణిపాకం క్రియేషన్స్, రాయుడు విజన్ మీడియా లి. సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాయుడు వి.శశాంక్ నిర్మాత. హైదరాబాద్‌లో ఈ చిత్రం వివరాల్ని వెల్లడించారు.
దర్శకుడు మాట్లాడుతూ- ''అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చేలా ఉంటుందీ యానిమేషన్ చిత్రం. వర్ణ రంజితంగా సాగే ఈ చిత్రంలో అయిదు గీతాలున్నాయి. ప్రముఖ సంగీత విద్వాంసులు దివంగత ఎల్.వైద్యనాథన్ స్వరాలు సమకూర్చారు. యుద్ధ ఘట్టాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయ''న్నారు. ఈ చిత్రంలోని పాటలను చిత్ర, సాధనాసర్గమ్, జేసుదాసు, విజయ్‌ఏసుదాసులాంటి ప్రముఖ గాయకులు ఆలపించార''న్నారు. ''రూ.25 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టుని తీర్చిదిద్దుతున్నాం. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతుంది. తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లిష్, తమిళ భాషల్లో విడుదల చేస్తామ''న్నారు నిర్మాత. వేసవిలో ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సమావేశంలో సుధాకర్, సుదేష్ణ తదితరులు పాల్గొన్నారు.