Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
11న వస్తున్న రానా ‘లీడర్’
      "ఇప్పటి వరకు రొమాన్స్‌, లవ్‌, యూత్‌ చిత్రాలు చేసిన నేను తొలిసారిగా నా జానర్‌ను మార్చుకొని రూపొందించిన చిత్రం 'లీడర్‌'. నా చిత్రాల నుంచి ప్రేక్షకులు ఆశించే నిజాయితీతో పాటు అన్ని రకాల అంశాలు ఇందులో వుంటాయి. ఇప్పటి వరకు వచ్చిన రాజకీయ నేపథ్య చిత్రాల్లో 'లీడర్‌' వెరీ వెరీ స్పెషల్‌గా వుంటుంది' అన్నారు ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల. సీనియర్‌ నిర్మాత డా.డి.రామానాయుడు మనవడు 'రానా' కథానాయకునిగా రూపొందిన 'లీడర్‌' చిత్రానికి శేఖర్‌ దర్శకుడు.

ఏవీఎమ్‌ సంస్థ పతాకంపై ఎం.శరవణన్‌, ఎం.ఎస్‌.గుహన్‌, అరుణ గుహన్‌, అపర్ణ గుహన్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు రాజకీయ పరిస్థితులు అన్నీ సవ్యంగా వున్నాయని, యాదృచ్ఛికంగా చిత్రం కథాంశంలో వున్న కొన్ని సంఘటనలు నేటి రాజకీయ వాతావరణంలో చోటు చేసుకున్నాయని, వాటికి అనుగుణంగా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేశానని శేఖర్‌ చెప్పారు. రియల్‌ లీడర్‌ ఎలా వుండాలి? దేశానికి ఎలాంటి లీడర్‌ అవసరమనే విషయాన్ని ఈ చిత్రంలో చర్చించామని, 'లీడర్‌'గా రానా అద్భుతమైన నటనను చూపెట్టాడని, ఈ చిత్రానికి వినూత్నంగా ప్రచారాన్ని చేయటానికి శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు.

ఎడిటర్‌ మార్తాండ్‌ కె.వెంకటేష్‌ మాట్లాడుతూ -"నేను ఎడిటింగ్‌ చేసిన 225 చిత్రాల్లో 'లీడర్‌' ది బెస్ట్‌ చిత్రంగా నిలుస్తుంది. తప్పకుండా నా టాప్‌ ఫైవ్‌ చిత్రాల్లో 'లీడర్‌' వుంటుంది' అని తెలిపారు. ఇలాంటి చిత్రానికి కెమెరామన్‌గా పనిచేయడం గర్వంగా వుందని విజయ్‌ సి.కుమార్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో చిత్ర నిర్మాణ నిర్వాహకుడు పుల్లారావు, మిక్కీ జె.మేయర్‌ కూడా పాల్గొన్నారు. రిచా గంగోపాధ్యాయ్‌, ప్రియా ఆనంద్‌ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి పాటలు డా.వేటూరి సుందరరామ్మూర్తి, కళా దర్శకుడు: పద్మశ్రీ తోట తరణి.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com