ఫిలిం న్యూస్
 
 
 
 
3చిత్రాల సన్నాహాల్లో ‘మధుర’ శ్రీధర్ రెడ్డి
‘స్నేహగీతం’ చిత్రంతో మంచి ఫీల్ గుడ్ మూవీ దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలతోపాటు ‘ఉత్తమ నూతన దర్శకుడి’గా ప్రతిష్టాత్మక ‘సూపర్ హిట్’ అవార్డు గెలుచుకున్న ‘మధుర’ శ్రీధర్ రెడ్డితో వరుసగా మూడు చిత్రాలు నిర్మించేందుకు ఒప్పందం చేసుకున్నారు ప్రవాసాంధ్ర వైద్యులు డాక్టర్ మున్న వెంకట కృష్ణారెడ్డి. నెల్లూరు వాస్తవ్యులైన వెంకటకృష్ణారెడ్డి గత 20 సంవత్సరాలుగా దక్షిణాఫ్రికా మరియు బోట్స్ వానా దేశాల్లో చిన్న పిల్లల ఆసుప్రతి నిర్వహిస్తూ అక్కడే స్థిరపడ్డారు.సినిమా రంగం పట్ల చిన్నప్పటినుంచి ఆసక్తి కలిగిన డాక్టర్ మున్నా వెంకట కృష్ణారెడ్డి ‘మధుర’ శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందించిన ‘స్నేహగీతం’ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యి ఆయనను సంప్రదించి, ఆయనతో వరుసగామూడు సినిమాలు నిర్మించేందుకు ఒప్పందం చేసుకున్నారు. షిర్డిసాయి కంబైన్స్ పతాకంపై ఈ మూడు చిత్రాలు రూపొందనున్నాయి.

ఈ సందర్భంగా నిర్మాత డా.మున్నా వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ- ‘ఒక సినిమా తీసి, ఆ సినిమా హిట్టవ్వకపోతే ఈ రంగం మనకు అచ్చిరాదనుకుంటా‘ అని నిరాశపడి వెనుతిరగడం నాకిష్టం లేదు. అందుకే వరుసగా మూడు చిత్రాలు నిర్మించేందుకు అవసరమైన వనరులు సమకూర్చుకుని ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాను. దర్శక, నిర్మాతలు కలిసి ఒక టీమ్ గా ఏర్పడి లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేస్తే విజయాల శాతం పెరుగుతుందని నా ప్రగాఢ నమ్మకం. ‘స్నేహగీతం’ సినిమా నాకు చాలాబాగా నచ్చింది. శ్రీధర్ ను ఆయన పట్ల నాకు మరింత సదాభిప్రాయం ఏర్పడింది. అందుకే ఆయనతోనే వరుసగా మూడుచిత్రాలు నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాను’ అన్నారు.

దర్శకుడు ‘మధుర’ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ- ‘నా రెండో చిత్రాన్ని కూడా అంతా కొత్త వాళ్లతో అది కూడా అందరూ తెలుగువాళ్ళతో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే ‘స్టార్ హంట్’ ప్రారంభిస్తాం. ఎంతో నమ్మకంతో నా మీద ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన మా నిర్మాత డా.మున్నా వెంకటకృష్ణారెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన నాపై వుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తాను. మిగిలిన వివరాలను అతిత్వరలో తెలియజేస్తాం’ అని అన్నారు.