నాగసిద్దార్థ, రాధిక జంటగా సాయిసద్యోజాత పిక్చర్స్ నిర్మిస్తున్న 'మా అబ్బాయి ఇంజనీరింగ్ స్టూడెంట్ ' చిత్రం
దాదాపు పూర్తయింది. మిగిలిన మూడు పాటల్లో రెండింటిని ఈ నెల 16 నుంచి బ్యాంకాక్‌లో, మరో పాటను
కర్నాటకలో చిత్రీకరిస్తామని చిత్ర నిర్మాతల్లో ఒకరైన డి.వి.చలం చెప్పారు. ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం
అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుండగా ఏర్పాటయిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
సినిమా బాగా వచ్చిందని, దర్శకునికి ఇది తొలి సినిమా అయినా బాగా తీస్తున్నారని చెప్పారు.
మరో నిర్మాత దంటు వెంకట గోపాలరావు మాట్లాడుతూ- ' చిన్న సినిమాగా ఇది ప్రారంభమైనా ఎక్కడా
రాజీపడకుండా నిర్మించడంతో బడ్జెట్ పెరిగింది. సినిమా సంతృప్తికరంగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని
ఆకట్టుకొనే సినిమా అవుతుంది' అన్నారు.
సహ నిర్మాత డి,కృష్ణస్వామి మాట్లాడుతూ - 'ఇప్పటికి ఎనభై శాతం చిత్రం పూర్తయింది. రాజమండ్రి, పరిసర
ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. రెండు పాటల చిత్రీకరణ కూడా జరిగింది. అందరి సహకారంతో సినిమా
బాగా తీయగలిగాం' అని చెప్పారు.
మరో సహ నిర్మాత డి.కిషోర్ మాట్లాడుతూ - 'అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టు నెలాఖరున కానీ,
సెప్టెంబర్ మొదటివారంలో కానీ సినిమాను విడుదల చేస్తామని చెప్పారు.
చిత్ర దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ - 'ట్రీట్‌మెంట్ బేస్ చేసుకుని తీస్తున్న విభిన్న ప్రేమకథాచిత్రమిది.
పూర్తి వినోదభరితంగా ఉంటుంది. పాటలు బాగా వచ్చాయి' అని తెలిపారు.
ఈ చిత్రంలో మంచి పాత్రలు చేసే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరోలు నాగసిద్దార్థ, భరత్, హీరోయిన్
రాధిక కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, సంగీతం: చిన్నిచరణ్, ఫొటోగ్రఫీ: రాజేంద్ర,
సమర్పణ: వి.ఎన్.ఎస్.కె. క్రియేషన్స్.