శ్రీకాంత్ నట ప్రస్థానం వందో మైలురాయికి చేరువైంది. 'పీపుల్స్ ఎన్‌కౌంటర్'తో తొలి అడుగువేసిన ఆయన విభిన్నమైన పాత్రలు పోషించి కథానాయకుడిగా స్థిరపడ్డారు. శ్రీకాంత్ వందో చిత్రం 'మహాత్మ'. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. సి.ఆర్.మనోహర్ నిర్మాత. భావన కథానాయిక. ఈ సినిమా లోగో, ప్రచార చిత్రాల్ని ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. రవితేజ, బెల్లంకొండ సురేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విలేఖరుల సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ ''నా వందో చిత్రం ఎవరితో చేయాలా? అని రెండేళ్ల క్రితమే ఆలోచించి కృష్ణవంశీని కలిశాను. తను ఒప్పుకొన్నాడు. నేను సెంచరీ చేసినందుకు గర్వపడట్లేదు. వందో సినిమాను కృష్ణవంశీతో చేస్తున్నందుకు గర్వపడుతున్నా. నా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకోకుండా భారీ బడ్జెట్‌తో 'మహాత్మ'ను తెరకెక్కిస్తున్న మనోహర్‌కి కృతజ్ఞతలు'' అని అన్నారు. కృష్ణవంశీ మాట్లాడుతూ ''నా స్నేహితుడు శ్రీకాంత్‌కు నేనిస్తున్న బహుమతి ఇది. 'మహాత్మ'ను పూర్తిగా శ్రీకాంత్‌ను దృష్టిలో పెట్టుకుని చేశాను. తనలోని మంచితనం ఈ చిత్రంలోనూ కనిపిస్తుంది. హింస నుంచి అహింసామార్గాన్ని వెతుక్కున్న యువకుడి కథ ఇది. నేను రెండున్నర గంటల సేపు చెప్పిన విషయాన్ని సీతారామశాస్త్రిగారు మూడు నిమిషాలు సాగే ఓ పాటలో చెప్పార''న్నారు. ''ఈ నెల 19న ఆడియో విడుదల చేస్తాం. పాటలు, చిత్రం ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకొంటాయ''ని నిర్మాత తెలిపారు. ''హింసను ప్రేమించే వ్యక్తి అహింసామార్గానికి ఎలా వెళ్లాడు అనేది కథ. కృష్ణకి 'అల్లూరి సీతారామరాజు', చిరంజీవి 'ఠాగూర్'లా శ్రీకాంత్‌కి మహాత్మ'' అన్నారు పరుచూరి బ్రదర్స్. ఈ చిత్రంలో ఛార్మి తళుక్కున మెరుస్తుంది. రచన: పరుచూరి బ్రదర్స్, సంగీతం: విజయ్ ఆంటోని, సాహిత్యం: సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ, లక్ష్మీభూపాల్, ఛాయాగ్రహణం: శరత్, కూర్పు: శంకర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్.
|