Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్‌
      దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఓ సంగీతభరిత ప్రణయకావ్యం తయారవుతోంది. ఆయనతో అల్లుడుగారు, మేజర్‌ చంద్రకాంత్‌ చిత్రాలు నిర్మించిన శ్రీ లకీప్రసన్న పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్ర కావ్యానికి శ్రీకారం చుట్టింది. మంచు మనోజ్‌కుమార్‌ ఇందులో కథానాయకుడు. డా.మోహన్‌బాబు ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. మోహన్‌బాబు తనయ లకీప్రసన్న ఈ చిత్రం ద్వారా నిర్మాతగా మారారు. రాఘవేంద్రుడి మనసెరిగిన కీరవాణి ఈ చిత్రానికి స్వరసారథి. 'పెళ్లి సందడి' తరహాలో ఇందులో కూడా 11 పాటలు చేస్తున్నారు. సాధ్యమైనంత మేరకు కొరియోగ్రాఫర్‌తో పనిలేకుండా దర్శకేంద్రుడే కొరియోగ్రాఫర్‌గా మారి పాటలను చిత్రీకరించనున్నారు.

ఎన్నో విశేషాలు కలిగిన ఈ చిత్రం షూటింగ్‌ ఈ నెల 12న నిరాడంబరంగా మొదలైంది. మనోజ్‌పై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి పద్మభూషణ్‌ వరప్రసాద్‌రెడ్డి కెమెరా స్విచాన్‌ చేయగా, దర్శకరత్న దాసరినారాయణరావు క్లాప్‌ ఇచ్చారు. మోహన్‌బాబు మాట్లాడుతూ- "రాఘవేంద్రరావు దర్శకత్వంలో నేను చేసిన అల్లుడుగారు, అల్లరి మొగుడు, మేజర్‌ చంద్రకాంత్‌ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. మా కలయికలో వస్తున్న నాల్గవ చిత్రం ఇది. 'మేజర్‌చంద్రకాంత్‌'లో మనోజ్‌ బాలనటుడిగా చేశాడు. ఇందులో హీరోగా చేస్తున్నాడు.

ఈ చిత్రం అతని నటజీవితానికి ఓ మైలురాయిలా నిలుస్తుందని ఆశిస్తున్నాను. కొత్త విషయం ఏమిటంటే... నా కుమార్తె లకీ ప్రసన్న ఈ చిత్రం ద్వారా తొలిసారి నిర్మాతగా మారారు. కీరవాణి అద్భుతమైన పాటలను అందించారు. ప్రతి పాట ఒక ఆణిముత్యమే. రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం వారిద్దరి విజయపరంపరను కొనసాగిస్తుందని నా నమ్మకం' అని చెప్పారు. "అతిర«థ మహారథులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈ సినిమాకు నేను నిర్మాతను కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ కథ కోసం ఆరు నెలలు కష్టపడ్డాం. ఈ చిత్రం ద్వారా కళా దర్శకుడిగా రఘు కులకర్ణిని, కథానాయికగా తాప్సీని పరిచయం చేస్తున్నాం. పక్కా స్క్రిప్ట్‌తో షూటింగ్‌ మొదలుపెట్టాం.

అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను' అని లకీప్రసన్న ఆకాంక్షించారు. అతిథిగా విచ్చేసిన నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ- "నా చెల్లెమ్మ లకీప్రసన్న నిర్మాతగా మారడం చాలా సంతోషం. విష్ణు, మనోజ్‌, లకీ ముగ్గురూ తండ్రిని మించే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అన్నారు. "రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో వచ్చిన 'మేజర్‌చంద్రకాంత్‌' చిత్రంలో బాలనటుడిగా చేశాను. ఇప్పుడు హీరోగా చేయబోతున్నాను. నేను చాలా అదృష్టవంతుడ్ని అనిపిస్తోంది. ఎన్నో నేర్చుకోవడానికి ఈ సినిమా నాకొక పాఠ్యాంశం లాంటిది. ఈ చిత్రం నా జీవితాన్ని మారుస్తుందని నా నమ్మకం' అని మనోజ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇంకా ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు, ఎం.ఎం.కీరవాణి, ఎస్‌.గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మూలకథ: భూపతిరాజా, కథ, స్క్రీన్‌ప్లే: గోపీమోహ న్‌, రవి బి.వి.ఎస్‌., మాటలు: శశి రాజసింహ, కెమెరా:ఎస్‌.గోపాల్‌రెడ్డి, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com