తనీశ్, నితి టేలర్ (పరిచయం) జంటగా లక్ష్మణ్ సినీ విజన్స్, లక్కీ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మేం వయసుకు వచ్చాం'. త్రినాథరావు నక్కిన దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం సారథీ స్టూడియోస్‌లో ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు తీస్తున్నారు. మంగళవారం హీరోయిన్ నితి జన్మదినం కావడంతో సెట్స్ వద్ద ఆమె జన్మదిన వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలి చిత్రమే అయినా ఎలాంటి ఇబ్బందీ లేకుండా చేయగలుగుతున్నాననీ, దిల్‌రుబా అనే ముస్లిం అమ్మాయి పాత్ర చేస్తున్నాననీ తెలిపారు.
హీరో తనీశ్ మాట్లాడుతూ "మంచి సినిమాకి అన్నీ కలిసొస్తాయన్నట్లు ఈ సినిమా మంచి వాతావరణంలో నడుస్తోంది. ప్రేమకథాచిత్రమైనా కొత్త తరహాలో ఉంటుంది'' అన్నారు. సినిమా చాలా బాగా వస్తున్నదనీ, హీరోయిన్ పాత్రకి నితి సరిగ్గా సరిపోయిందనీ, సినిమాకి ప్రత్యేకాకర్షణ ఆమేననీ దర్శకుడు త్రినాథరావు చెప్పారు. కథానుసారం పాతబస్తీలోనూ షూటింగ్ జరుపుతున్నామన్నారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ "ఈ నెల 24 వరకు ఈ షెడ్యూలు జరిపి, తర్వాత చెన్నై, పాండిచ్చేరిలో డిసెంబర్ 15 వరకు జరిపే షెడ్యూలుతో సినిమా పూర్తి చేస్తాం. జనవరి 26న చిత్రాన్ని విడుదల చేయాలనేది మా సంకల్పం. దర్శకుడు బాగా తీస్తున్నారు.
సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఎస్సెట్ అవుతుంది'' అని తెలిపారు. రమాప్రభ, సూర్య, విశ్వనాథ్ కాశీ, సన, రక్ష, అనితానాథ్, స్నిగ్ధ, పూనమ్‌శర్మ, తాగుబోతు రమేశ్, ధనరాజ్, చంద్ర, రంజిత్, కార్తికేయ, బాషా, సాయి, హరికృష్ణ, మోహన్, శ్రావణ్‌కుమార్ తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: నివాస్, రచనా సహకారం: సాయికృష్ణ, స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: ఉదయ్ భాగవతుల, పాటలు: భాస్కరభట్ల, సంగీతం: శేఖర్‌చంద్ర, కళ: వర్మ, కొరియోగ్రఫీ: స్వర్ణ, సహ నిర్మాతలు: బసిరెడ్డి, ఘంటా నాగేశ్వరరావు, నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, లక్ష్మణ్ కేదారి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: త్రినాథరావు నక్కిన.