ఫిలిం న్యూస్
 
 
 
 
'ముగ్గురు'తో రామానాయుడు
సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మిస్తోన్న చిత్రానికి ‘ముగ్గురు’ అనే పేరును ఖరారు చేశారు. నవదీప్, రాహుల్, అవసరాల శ్రీనివాస్, శ్రద్ధాదాస్, రీమాసేన్, సంజన ఇందులో ప్రధాన పాత్రధారులు. వీయన్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం వివరాలను బుధవారం విలేకరులకు రామానాయుడు చెబుతూ- ‘‘ఆద్యంతం వినోదభరితంగా సాగే సినిమా ఇది. గత నెలలో షూటింగ్ ప్రారంభించాం.

మలేసియాలో 20 రోజుల పాటు జరిగిన షూటింగ్‌లో మూడు పాటలు, కొన్ని కీలక సన్నివేశాలు తీశాం. ఈ నెల 25 నుంచి 28 వరకు మా ఊరు కారంచేడులో షూటింగ్ చేస్తాం. 29 నుంచి జూలై 10 వరకు మిగిలిన బ్యాలన్స్ వైజాగ్ స్టూడియోలో చేస్తాం’’ అని తెలిపారు. ‘‘సురేష్ సంస్థలో అసిస్టెంట్ డెరైక్టర్‌గా అవకాశం దొరికితే చాలు అని ఒకప్పుడు అనుకునేవాణ్ని. ఇప్పుడు ఆ సంస్థ నిర్మిస్తోన్న చిత్రానికి దర్శకుడిని అవ్వడం గర్వంగా ఉంది. ఈ సినిమా నిర్మాణంలో నాయుడుగారి వద్ద చాలా నేర్చుకున్నాను.

తప్పకుండా ఈ చిత్రం సూపర్‌హిట్ చేసి నాయుడు గారి రుణం తీర్చుకుంటా’’ అని వీయన్ ఆదిత్య అన్నారు. ఇంకా నవదీప్, అవసరాల శ్రీనివాస్, రాహుల్, శ్రద్ధాదాస్, నివాస్, జవహర్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్, నివాస్, సంగీతం: కోటి, కెమెరా: జవహర్‌రెడ్డి.