'జోష్'తో ఈ నెలలోనే తెర మీదకు రాబోతున్న యువ కథానాయకుడు నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా నటించే రెండో చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇందిర ప్రొడక్షన్స్ పై.లి. సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గౌతమ్ మీనన్ దర్శకుడు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూరుస్తారు. దేవుని పటాలపై చిత్రించిన ముహూర్తపు సన్నివేశానికి కృష్ణ క్లాప్‌నివ్వగా, అక్కినేని నాగేశ్వరరావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. డి.రామానాయుడు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ''నాగేశ్వరరావు అశీస్సులతోనే నేను నటుడినయ్యాను. ఆయనతో మా సంస్థల ద్వారా హేమాహేమీలు, రాజకీయ చదరంగం చిత్రాలు నిర్మించాం. నాగార్జునతో నటించానే తప్పా సినిమా నిర్మించలేదు. నాగచైతన్యతో మా అమ్మాయి మంజుల సినిమా తీస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంద''న్నారు. నాగార్జున మాట్లాడుతూ ''చైతన్య తొలి చిత్రం విడుదల కాకుండానే రెండో చిత్రం మొదలుకావడం ఆనందంగా ఉంది. చైతుకు గౌతమ్ దర్శకత్వంలో నటించాలని ఎంతో ఆశ. ఆ కల ఇలా నెరవేరింది. ఈ సంస్థ చిత్రంలో నేను నటించాల్సి ఉంది. కానీ ఈ కథ చైతన్యకు సరిపోతుంది. గీతాంజలి తరహాలో ఈ చిత్రం విజయం సాధిస్తుంది. రెహమాన్ సంగీతం నా చిత్రాలకు కుదరలేదు. మా అబ్బాయికి రెండో చిత్రానికే దక్కడం చాలా ఆనందంగా ఉంద''న్నారు. నాగచైతన్య మాట్లాడుతూ ''గౌతమ్ దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉంది. రెండో చిత్రమే ఇంత మంచి కలయికలో రావడం అదృష్టంగా భావిస్తున్నాన''న్నారు. ''సంగీత ప్రాధాన్యమున్న ప్రేమ కథా చిత్రం. రెండు సినిమా కుటుంబాల వారసుడితో చేస్తుండటం వలన నాపై ఎక్కువ బాధ్యత పెరిగింది. కథానాయికను ఇంకా నిర్ణయించలేద''న్నారు దర్శకుడు. మంజుల మాట్లాడుతూ ''నా మీద నమ్మకంతో నాగచైతన్యను అప్పగించారు. దానికి తగ్గట్టుగానే మంచి నిర్మాణాత్మక విలువలతో సినిమా తీసి నాగార్జునకు బహుమతిగా ఇస్తాను. న్యూయార్క్, కేరళ, హైదరాబాద్‌ల్లో చిత్రీకరిస్తామ''న్నారు. ఛాయాగ్రహణం: మనోజ్, కళ: రాజీవన్, కూర్పు: ఆంథోని.
|