ఫిలిం న్యూస్
 
 
 
 
నారా రోహిత్ కొత్త చిత్రం
‘బాణం’ ఫేమ్ నారా రోహిత్ హీరోగా యువత, ఆంజనేయులు చిత్రాల దర్శకుడు పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఎస్వీకె సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సంస్థ లోగోని శనివారం వంశీ పైడిపల్లి ఆవిష్కరించారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘మంచి సినిమా తీయాలనే లక్ష్యంతో షిప్పింగ్ బిజినెస్ నుంచి ఇటు వచ్చాను. మంచి కథ, చక్కటి టీమ్ దొరికింది. వచ్చే నెల 13న షూటింగ్ ప్రారంభిస్తాం. మేలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ -‘‘నారా రోహిత్ రూపంలో తెలుగు సినిమాకు పరిపూర్ణమైన కమర్షియల్ హీరో లభించబోతున్నాడు. ప్రకాశ్‌రాజ్ ముఖ్య భూమిక పోషించబోతున్నారు. జయసుధ, ఎమ్మెస్ నారాయణ, అలీ ప్రధాన తారలుగా నటిస్తారు. శక్తివంతమైన పాత్రచిత్రణతో అల్లుకున్న ప్రేమకథ ఇది’’ అని చెప్పారు. ‘బాణం’ తర్వాత మంచి కథ దొరక్కపోవడంతో ఇన్నాళ్లూ ఆగానని, తన కెరీర్‌లోనే గుర్తుండిపోయే విధంగా ఈ చిత్రం ఉంటుందని నారా రోహిత్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: శ్రీకాంత్ నరోజ్, ఆర్ట్: రఘు కులకర్ణి, ఎడిటింగ్, మార్తాండ్ కె.వెంకటేశ్, స్టైలింగ్: అర్చన పెట్ల, అడిషనల్ స్క్రీన్‌ప్లే: సత్య, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్.