ఫిలిం న్యూస్
 
 
 
 
జాసన్ మామో 'ఒక్క వీరుడు'

‘కొనాన్ - ది బార్బేరియన్’ అనే ఎడ్వెంచరస్ ఇంగ్లీషు చిత్రం ఈ నెలాఖరుకు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మార్కస్ నిస్పెట్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాసన్ మామో కథానాయకుడు. రేచల్ నిఖోల్ కథానాయిక. ‘కత్తులు - మంత్రాలు’ నేపధ్యంలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఇంగ్లీషు వెర్షన్ ‘కొనాన్ - ది బార్బేరియన్’తో పాటు, తెలుగు వెర్షన్ ను ‘ఒక్క వీరుడు’ పేరుతో హీరా ఫిలింస్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత శరద్ జోషి.

తనకు ఊహ కూడా తెలియని వయసులో తన తండ్రిని అత్యంత కిరాతంగా చంపడమే కాకుండా... తమ గ్రామాన్ని నామరూపాల్లేకుండా చేసి, తమ తెగకు చెందినవారందర్నీ తెగనరికి చంపినవారిపై హీరో ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది ‘ఒక్క వీరుడు’ చిత్రం ప్రధానాంశమని శరద్ జోషి వివరిస్తున్నారు. హీరోని నేరుగా ఎదుర్కోలేక... విలన్లు తాంత్రిక శక్తుల సహకారం సైతం తీసుకుంటారని, ఆ తాంత్రిక శక్తుల్ని కూడా హీరో ఎలా ఎదుర్కొన్నాడు? వారిని ఏవిధంగా హతమార్చాడు? అన్నది సాంకేతిక ప్రమాణాలు, రాజీ లేని నిర్మాణ విలువలతో రూపొందిన ఈ చిత్రం యాక్షన్ చిత్రాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తుందని, ఈ చిత్ర కథాకథనాలను సిద్ధం చేసుకోవడం కోసం దాదాపు ఏడేళ్లు దర్శకనిర్మాతలు అవిశ్రాంతంగా కృషి చేసారని నిర్మాత శరద్ జోషి చెబుతున్నారు. 400 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మాణమైన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తమ ‘హీరా ఫిలింస్ ప్రయివేట్ లిమిటెడ్’ పతాకంపై విడుదల చేసే అవకాశం లభించినందుకు నిర్మాత శరద్ జోషి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు!