'అరుంధతి'తో కథానాయికగా అనుష్క స్థాయి పెరిగింది. ఇప్పుడు ఆమెతో సాయిరత్న క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం 'పంచాక్షరి'. సముద్ర దర్శకుడు.
బొమ్మదేవర రామచంద్రరావు (చంద్ర) నిర్మాత. ఈయన ప్రముఖ కథానాయకుడు నాగార్జున వ్యక్తిగత ఆహార్య నిపుణుడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ గీతాన్ని
చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా 'పంచాక్షరి' లోగోను ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ''నేను శివరామరాజు చేస్తున్నప్పటి నుంచి చంద్రతో
పరిచయం ఉంది. ఆయన నిర్మాణంలో సినిమా రూపొందిస్తున్నందుకు ఆనందంగా ఉంది. వేసవికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు.
అనుష్క చిత్రం గురించి చెబుతూ ''అరుంధతికీ, పంచాక్షరికి అసలు సంబంధం లేదు. నాకు తొలిసారి మేకప్ వేసింది చంద్ర.. సూపర్ సమయంలో! నేను
సినిమా తీస్తే నటిస్తావా? అని అడిగారు. అప్పడు నా భవిష్యత్తు గురించి నాకే సరిగా తెలియదు. అయినా నా మీద నమ్మకం ఉంచి అడిగారు. ఇప్పుడిలా ఆయన
మాటలు రూపుదాలుస్తున్నందుకు ఆనందంగా ఉంద''న్నారు. ''నాకు అన్నపూర్ణ సంస్థతో ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేను. ఆ సంస్థకు నేను
జీవితకాలం రుణపడి ఉంటాను'' అన్నారు చంద్ర. 'పంచాక్షరి'లో సామ్రాట్, నాజర్, చంద్రమోహన్, బ్రహ్మానందం తదితరులు ఇతర పాత్రధారులు.
ఛాయాగ్రహణం: వాసు, కథ: మధు విప్పర్తి, మాటలు: తోట ప్రసాద్, సంగీతం: చిన్నా, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ, ఎగ్జిక్యూటివ్
నిర్మాత: అక్కినేని వెంకటరత్నం, సమర్పణ: అక్కినేని నాగార్జున.
|