' నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించనున్న 'పరమవీరచక్ర' షూటింగ్ అభిమానుల కేరింతల నడుమ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియం ఈ కోలాహలానికి వేదికైంది. గురువారం ఉదయం జరిగిన ముహూర్తపు సన్నివేశానికి సినీ, రాజకీయ ప్రముఖులు పలువురు హాజరయ్యారు. బాలయ్య పుట్టిన రోజు వేడుకలు కూడా అదే వేదికపై జరిగాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహిస్తున్న 150వ సినిమా 'పరమవీరచక్ర'. 50వ వసంతంలో అడుగుపెట్టిన బాలయ్య తొలిసారి దాసరి దర్శకత్వంలో నటిస్తున్నారు. తేజ సినిమా పతాకంపై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. బాలకృష్ణపై చిత్రించిన ముహూర్తపు సన్నివేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు క్లాప్‌నిచ్చారు. దాసరి పద్మ స్విచ్ఛాన్ చేశారు. దాసరి నారాయణరావు గౌరవ దర్శకత్వం వహించారు. 'ధర్మానికి నువ్వే రాజువై..' అంటూ సాగే పల్లవికి బాలకృష్ణ అభినయించారు. ముందుగా తనదైన శైలిలో అభిమానులను ఉర్రూతలూగించే భారీ డైలాగును చెప్పారు. "...మరో బెబ్బులి పులి అవుతాడు'' అంటూ ముక్తాయించిన డైలాగుకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. సీఎం బాలయ్య అనే నినాదాలు వినిపించాయి.
నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ "ముహూర్తపు వాతావరణం చూస్తుంటే సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని కుతూహలం కలుగుతోంది. ఇలాంటి సినిమాలు బాలయ్య తప్ప ఎవరూ చేయలేరు. ఎవరికీ సాధ్యం కాదు. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, సింహా.. ఇవన్నీ బాలయ్యకే సాధ్యం. నందమూరి తారకరామారావు గారితో బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు, మనుషులంతా ఒకటే వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు దాసరి. వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమాకు జనమంతా నీరాజనాలు పడతారు. కనీవినీ ఎరుగని విజయాన్ని మూటగట్టుకుంటుందీ చిత్రం. దాసరి మొండిమనిషి. ఆయనలోని సృజన అందరి మెప్పు పొందుతుంది. మా బాలయ్య రోజురోజుకీ యువకుడిలా కనిపిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రజలు ఆదరించాలని కోరుతున్నాను'' అని పేర్కొన్నారు.
దాసరి మాట్లాడుతూ "బాలయ్యకు 50 ఏళ్ళు కాదు. తను ఇప్పుడే పుట్టిన బిడ్డ. ఎన్టీఆర్ 60 ఏళ్ళ తర్వాత కూడా మంచి స్టెప్పులేసి జనాలను ఉర్రూతలూగించారు. ఈ సినిమా గురించి నేనేమీ మాట్లాడను. సినిమా విడుదలయ్యాక సినిమా మాట్లడుతుంది. నామీద గురుతర బాధ్యతలున్నాయి. సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి.. కోవలో ఈ చిత్రం కూడా చరిత్రలో నిలుస్తుంది. అందుకు తగ్గ ప్రయత్నాలు చేస్తున్నామ''ని అన్నారు.
బాలకృష్ణ ప్రసంగిస్తూ "కర్నూలు సమీపంలోని పాణ్యం నియోజకవర్గంలో నా అభిమాని నాగన్న తొక్కిసలాటలో చనిపోయారు. ఆయన కుమార్తె పేరు మీద రూ.లక్షను ఎన్టీఆర్ ట్రస్టు తరఫున ఫిక్డ్ ్స డిపాజిట్ చేస్తున్నాం. నాగన్న కుమారుడికి మోడల్ స్కూల్లో ఉచిత విద్యను అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కడపలో మృతి చెందిన మరో అభిమానికి మా అభిమానుల తరఫున రూ.50వేలను ప్రకటిస్తున్నాం. ఏమీ ఆశించకుండా కళాకారుల మీద అభిమానులు చూపించే అభిమానమే మాకు కొండంత అండ. వారి ఆదరణ, ఆప్యాయత, అనురాగమే మిన్న. వెన్నుదన్న. ఈ అభిమానం డబ్బిచ్చి కొనేది కాదు. 'సింహా' ప్రసాదించిన విజయంతోనే పరమవీరచక్రకు శ్రీకారం చుడుతున్నాం. నేను దాసరి అభిమానిని. ఆయనతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మా నాన్న ఆశీర్వాదబలం నామీద ఎప్పుడూ ఉంటుంది. ఇంకా ఎన్నెన్నో సినిమాలు చేసి అభిమానులను ఉత్సాహపరుస్తాను. నాకు 50ఏళ్ళు రావడం, దాసరి 150వ సినిమాలో నటించడం.. ఇదంతా చిత్రం భళారే విచిత్రంగా అనిపిస్తోంది. దాసరి పరిశ్రమకు పెద్దదిక్కు. అందరికీ నోట్లో నాలుకగా ఉంటారు. పరిశ్రమ ఎప్పుడూ చల్లగా ఉండాలని సి.కల్యాణ్ కోరుకుంటారు. మా ముగ్గురి కలయికలో వస్తున్న సినిమాకు మంచి ఆదరణ ఉంటుంది. 'బొబ్బిలిపులి'లో మేజర్ చక్రధర్‌కు పరమవీరచక్ర బిరుదుగా దక్కుతుంది. మా సినిమాకు అదే బిరుదాంకితమైంది. ఈ సినిమా ప్రాంభోత్సవమే శతదినోత్సవ వేడుకలా ఉంది. సత్సంకల్పం, అకుంఠిత దీక్షతో నడిస్తే విజయం తథ్యం అనే నాన్నగారి బాటలో నడుస్తున్నాను'' అని ముక్తాయించారు.
ప్రారంభోత్సవానికి మురళీమోహన్, దొరస్వామిరాజు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హరికృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, రామకృష్ణ, తారకరత్న, కోదండరామిరెడ్డి, డీవీయస్‌రాజు, బోయపాటి శీను, పోకూరి బాబూరావు, ఏవీయస్, వేణుమాధవ్, చక్రి, నన్నపనేని రాజకుమారి తదితరులు హాజరయ్యారు.