Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
‘పెరియార్’ ప్రీమియర్ షోలో ప్రముఖులు
      న్యాయం కోసం... నమ్మిన ఆశయం కోసం పోరాడిన పెరియార్‌ రామస్వామి జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని పలువురు వక్తలు పిలుపు నిచ్చారు. పెరియార్‌ రామస్వామి నాయకర్‌ ప్రీమియర్‌ షో (తెలుగు)ను ఐమాక్స్‌లో సోమవారం ప్రదర్శించారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఎం.కె.స్టాలిన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరియార్‌ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారని కొనియాడారు. ఆయన జీవిత చరిత్రను నేటి యువతరానికి సినిమా రూపంలో తెలియపర్చడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెరియార్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేసే అంశాన్ని ముఖ్యమంత్రి రోశయ్యతో చర్చిస్తానన్నారు.

రాష్ట్ర విద్యాశాఖమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ మాట్లాడుతూ పెరియార్‌ విగ్రహ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు మాట్లాడుతూ రాజ్యం కంటే ఆలోచన గొప్పదని పెరియార్‌ చెప్పారన్నారు. సినిమాలో పెరియార్‌ పాత్రను ప్రముఖ తమిళ హీరో సత్యరాజు, ఆయన సతీమణి పాత్రను ప్రముఖ నటి కుష్బు, తండ్రి పాత్రను కైకాల సత్యనారాయణ పోషించారు. మాటలు, డైలాగ్‌లు కత్తిపద్మారావు, పాటలు గోరటి వెంకన్న సమకూర్చారు.

ఇప్పుడే సినిమా వంద రోజుల పంక్షన్‌ జరుపుకున్నంత ఆనందంగా ఉందని నిర్మాత సునీల్‌ ఆనందం వ్యక్తం చేశారు. దర్శకుడు జ్ఞాన రాజశేఖర్‌ మాట్లాడుతూ సత్యరాజ్‌, కుష్బూ ఆయా పాత్రల్లో జీవించారన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే జయకుమార్‌, ద్రవిడార్‌ కజగం అధ్యక్షుడు కె.వీరమణి, మాజీ ఎంపీ మల్లు రవి, రాష్ట్ర దళిత సేన అధ్యక్షుడు జె.బి.రాజు తదితరులు పాల్గొన్నారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com