తెలుగుతెరపై ఇదివరకు ఎన్నడూ చూడని ఓ ప్రయోగం త్వరలో కనిపించబోతోంది. సిగ్నేచర్ క్రియేషన్స్ పతాకంపై రత్తమ్మ బలుసు నిర్మించే ఆ సినిమా పేరు 'ప్రయోగం'. ఈ చిత్రం ద్వారా - చిత్రనిర్మాణంలో లండన్ లో శిక్షణ పొందిన భానుప్రకాశ్ దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. సూర్య ('షో' ఫేమ్) ప్రధాన పాత్రధారి. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్ట్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
"ఈ చిత్రం కోసం యాభై మంది ఆర్టిస్టులకు 66 రోజుల పాటు శిక్షణ ఇచ్చి , ఆ తర్వాత పదిహేను రోజుల్లోషూటింగ్ పూర్తిచేశాం. ప్రముఖ చాయా గ్రహకుడు టి. సురేంద్రరెడ్డి నేతృత్వం లో ఎ.జి.ఎ.ఎఫ్ 100 అనే కొత్త డిజిటల్ కెమెరాతో చిత్రీకరణ జరిపాం.మామూలుగా ఏకకాలంలో ఒకే సీనుతో ఒకే స్క్రీను కనిపిస్తుంది. కానీ రెండున్నర గంటల మా సినిమాలో రెండు గంటలపాటు తెరపై నాలుగు ఫ్రేముల్లో నాలుగు సన్నివేశాలు నిరంతరాయంగా నడుస్తుంటాయి. అది కూడా కెమెరాని కదల్చకుండా ఒకే చోట ఉంచి చిత్రీకరించాం. నాకు తెలిసి ప్రపంచ సినిమా చరిత్రలోనే ఇది తొలి ప్రయోగం'' అని చెప్పారు భానుప్రకాశ్.
అయితే ఇది రెగ్యులర్ కమర్షియల్ కథతో నడిచే సినిమాయే. "పూర్తి వినోదాన్నిచ్చే క్రైమ్, సస్పెన్స్ సినిమా ఇది. డ్రగ్స్ నేపథ్యంలో నాలుగు గ్రూపుల మధ్య కథ నడుస్తుంది. ఆ నాలుగు గ్రూపులెవరంటే.. పోలీసులు, గ్యాంగ్‌స్టర్లు, విద్యార్థులు, సెక్స్‌వర్కర్లు. డిటెక్టివ్ సైంటిస్ట్‌గా సూర్య కనిపిస్తారు'' అని భానుప్రకాశ్ తెలిపారు. రుద్రప్రకాశ్, శరత్, శివాజీరావు, విజయ్‌కుమార్, పూజిత, కనకదుర్గ, విక్రమ్, గోపీనాథ్, సూర్యతేజ, భానుప్రకాశ్ తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: జాన్ పీటర్, ఛాయాగ్రహణం: టి. సురేంద్రరెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భానుప్రకాశ్.