Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
కె.అచ్చిరెడ్డి, విజయభాస్కర్ ల ‘ప్రేమ కావాలి’
     ప్రముఖ నటుడు సాయికుమార్‌ తనయుడు ఆది కథానాయకుడిగా తెరంగేట్రం చేస్తున్నారు. మ్యాక్స్‌ ఇండియా ప్రై.లి. సంస్థ ఆదితో 'ప్రేమ కావాలి' అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయభాస్కర్‌.కె. దర్శకత్వం వహిస్తున్నారు. కె.అచ్చిరెడ్డి నిర్మాత. క్యాథరిన్‌ కథానాయిక. సినీ ప్రముఖుల నడుమ ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్‌నిచ్చారు. బాలకృష్ణ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నాగార్జున గౌరవ దర్శకత్వం వహించారు. డి.రామానాయుడు సంస్థ లోగోను, శ్రీహరి సినిమా టైటిల్‌ను ఆవిష్కరించారు.

అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ''చిత్ర పరిశ్రమది కన్నతల్లి లాంటి మనసు. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకొంటుంది. సాయికుమార్‌ తనయుడు కథానాయకుడు కావడం ఆనందంగా ఉంది. నా ఆశీస్సులు వారికి ఉంటాయి. కళా నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చాడు ఆది. తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది. సాయికుమార్‌ తండ్రిని మించిన తనయుడు అయ్యాడు. ఆది కూడా అలాగే ఎదగాలి. విజయభాస్కర్‌ మంచి సమయస్ఫూర్తి ఉన్న దర్శకుడు. సున్నితమైన భావోద్వేగాలు పలికించడంలో అతనికి అతనే సాటి. అలాంటి దర్శకుడి చేతిలో పడటం చక్కటి భవిష్యత్తుకు సంకేతం'' అన్నారు.

బాలకృష్ణ మాట్లాడుతూ ''ఆది హీరోగా తొలి అడుగులోనే విజయాన్ని అందుకోవాల''ని ఆకాంక్షించారు. ''సాయి మొహంలో ఒక రకమైన టెన్షన్‌ కనిపిస్తోంది. ఏడాది కింద నాకూ అలాంటి అనుభవమే. ఆది మొదటి షాట్‌లోనే అదరగొట్టాడు. నాకు ఇష్టమైన దర్శకుడు విజయభాస్కర్‌. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంద''న్నారు నాగార్జున.

ఈ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు, కె.విశ్వనాథ్‌, కృష్ణ, కృష్ణంరాజు, హరికృష్ణ, మురళీమోహన్‌, జయసుధ, రమేష్‌ప్రసాద్‌, రవితేజ, రాజమౌళి, ఎస్వీ కృష్ణారెడ్డి, రోజా, పీజే శర్మ, ప్రకాష్‌రాజ్‌, కేఎల్‌ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com