విఖ్యాత చిత్ర నిర్మాణసంస్థ ‘వాల్ట్ డిస్నీ’ 2,500 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల ‘మే’ 28న ప్రపంచవ్యాప్తంగా
విడుదలవుతోంది. ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ చిత్రాన్ని ‘రత్న సెల్యులాయిడ్స్’ సమర్పణలో ‘మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్ మెంట్స్’ ప్రై.
లిమిటెడ్ ద్వారా జవహర్ బాబు విడుదల చేస్తున్నారు. 150కి పైగా ప్రింట్లతో విడుదలవుతున్న ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తెలుగు
భాషలలో ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. ఐమాక్స్ బిగ్ స్క్రీన్ పై కూడా ఈ చిత్రం ప్రదర్శితమవనుంది.
‘నార్నియా’ చిత్రం తరువాత భారీ వ్యయంతో, భారీ హంగులతో వాల్ట్ డిస్నీ సంస్థ ఈ ‘ప్రిన్స్ ఆఫ్ పర్షియా’ను రూపొందించింది.
పర్షియా రాజ్యానికి దేవుడు ఒక కానుక ఇచ్చివుంటాడు. ఆ కానుక వల్లనే పర్షియా దేశం ప్రపంచంలోనే అత్యున్నతంగా వెలుగొందుతూ
వుంటుంది. ఆ కానుకే ‘శాండ్స్ ఆఫ్ టైమ్’. దానిని చేజిక్కించుకొని ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకోవాలని ప్రతినాయకుడు నవాబ్
భావిస్తాడు. అయితే పర్షియా యువరాజు, అతని ప్రియురాలు, పొరుగు దేశపు యువరాణి కలసి నవాబు దుష్ట పన్నాగాన్ని
అంతమొందించి ప్రజలకు మేలు జరిగేలా చూస్తారు.
పర్షియా యువరాజుగా ‘జాక్ గైలెన్ హాల్’, యువరాణిగా జేమ్స్ బాండ్ చిత్ర నాయిక ‘జమ్మా ఆర్టెరిటన్’, ప్రతినాయకుడు నవాబ్ గా
‘గాంధీ’ గా నటించి ఆస్కార్ అవార్డ్ పొందిన ‘బెన్ కింగ్ స్లే’ కనిపిస్తారు. మైక్ న్యూయెల్ దర్శకత్వం వహించిన ఈ ‘ప్రిన్స్ ఆఫ్ పర్షియా’ను
‘జెర్రి బ్రూక్ హైమర్’ నిర్మించారు. ఫాంటసీ యాక్షన్, ఎడ్వంచర్ వంటి అంశాలతో రూపొందిన ఈ ‘ప్రిన్స్ ఆఫ్ పర్షియా’ ఆంధ్రప్రేక్షకులను
ఆకట్టుకోవటంతో పాటు తమ సంస్థ స్థాయిని పెంచుతుందని ‘రత్న సెల్యులాయిడ్స్’ అధినేత జక్కం జవహర్ బాబు, ‘మల్టీ డైమన్షన్’
ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై. లిమిటెడ్ ప్రతినిధి వాసు తెలిపారు.