సునిల్ కథానాయకుడిగా వీరభద్రం దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీమేకర్స్ సమర్పణలో మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న ‘పూలరంగడు’ సినిమా ప్రారంభోత్సవం అన్నపూర్ణా స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమంలో కెమెరా స్విచాన్ సుకుమార్ చేయగా రాజమౌళి క్లాప్ నిచ్చారు. ముహూర్తపు దృశ్యానికి రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో చిత్రం దర్శకుడు వీరభద్రమ్, అచ్చిరెడ్డి, సునిల్, అలీ, ఇషీచావ్లా, సురేష్ రెడ్డిలు పాల్గొన్నారు.
సునిల్ మాట్లాడుతూ - దర్శకుడు కథ చెప్పగానే ‘అందాల రాముడు‘ సినిమా తరువాత నాకు చేయతగ్గ సినిమాగా అనిపించింది. అచ్చిరెడ్డిగారి ఆధ్వర్యంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు మంచి సంభాషణలు కుదిరాయి. ఇది మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది అన్నారు.
వీరభద్రమ్ మాట్లాడుతూ -నా తొలి సినిమా విజయవంతం అయిన తరువాత ఏ సినిమా చేద్దామని ఆలోచిస్తున్న సమయంలో ఈ చిత్రం కథ తయారు చేసుకుని సునిల్ ను వెళ్ళి కలిసి చెప్పాను. సునిల్ ఈ కథ ఆర్.ఆర్.మూవీమేకర్స్ బ్యానర్ లో చేద్దామని నిర్మాతల వద్దకు తీసుకుని వెళ్ళారు. ఈ సినిమా సునిల్ బాడీలాంగ్వేజ్ కు తగ్గ విధంగా ఉంటుంది. ఈ సినిమాలో నటిస్తున్న ఇషాచావ్లా సునిల్ ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి చిరకాల మిత్రుడు అనూప్ మంచి సంగీతాన్ని అందిస్తున్నాడు అన్నారు.
అచ్చిరెడ్డి మాట్లాడుతూ - ఈ సినిమా టైటిల్ వింటే మన సంక్రాంతి పండుగ గుర్తుకు వస్తుంది. మనలో ఒకడిగా కనిపించే సునిల్ ఈ సినిమాలో కథానాయకుడిగా బాగుంటాడని అతన్ని హీరోగా తీసుకోవడం జరిగింది. సినిమాకు మంచి సాంకేతిక నిపుణులు కుదిరారు. ఇషాచావ్లాకు మా బేనర్ లో ఇది రెండవ సినిమా.
సునిల్, ఇషాచావ్లా, కోటశ్రీనివాసరావు, అలీ, ప్రదీప్ రావత్, రఘుబాబు, దేవ్గిల్, పృథ్వీ, సుథ, ప్రగతి, శ్రీలలిత, తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు మాటలు : శ్రీధర్ పిపాస, సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ళ, సంగీతం : అనూప్ రూబెన్స్, నిర్మాత : అచ్చిరెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : వీరభద్రమ్.