రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా సన్‌షైన్ ప్రొడక్షన్స్ పతాకంపై క్రాంతి మాధవ్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నారాయణరావు మాస్టారు’. చిత్రానికి సంబంధించిన ప్రారంభ సన్నివేశాన్ని నటుడు రాజేంద్ర ప్రసాద్‌పై చిత్రీకరించారు. రమేష్ ప్రసాద్ తొలిక్లాప్ ఇవ్వగా స్రవంతి రవికిషోర్ స్విచ్చాన్ చేసారు. గిరిబాబు గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ- ‘ఈ సినిమాలో నేను ’నారాయణరావు మాస్టారు‘ అనే పాత్ర పోషిస్తున్నాను. సినిమా పరిశ్రమలో నాకంటూ ఒక గుర్తింపు రావడానికి దోహదపడ్డ ‘లేడీస్ టైలర్’ తమ్ముడు సత్యం, హరి అనుమోలులతోకలిసి పనిచేయడం ఆనందంగావుంది. నటుడిగా ఎన్నోరకాల పాత్రలు చేస్తూవుంటాము. అయితే వాటిలో కొన్ని మాత్రమే మనసుకు హత్తుకుంటాయి. కొన్ని సినిమాల్లో మాత్రమే తెలియని ఉద్వేగం వుంటుంది. అలాంటి ఉద్వేగం ఈ కథ విన్నప్పుడు కలిగింది. ఈ సినిమాలో మాస్టర్ పాత్ర విలువలో కూడుకునివుంటుంది. మానాన్న స్కూల్ టీచర్ కాబట్టి నా చిన్నతనంలోఆయన అందుకునే గౌరవం నాకు తెలుసు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కనిపించడు. కేవలం పాత్ర మాత్రమే కనిపిస్తుంది’ అన్నారు.
మరుధూరి రాజా మాట్లాడుతూ- ‘మనకున్న గొప్ప నటుల్లో రాజేంద్రప్రసాద్ ఒకరు. ఆయన చేసిన ‘ఆ నలుగురు’ సినిమాకు మాటలు రాయలేకపోయాను. ఆయనతో కలిసి మళ్ళీ పనిచేయడం ఆనందంగావుంది. ఒక మంచి విషయం వున్న సినిమా ఇది’ అన్నారు.
చిత్ర దర్శకుడు క్రాంతి మాధవ్ మాట్లాడుతూ- ‘రాజేంద్ర ప్రసాద్ గురువుగా నటిస్తున్నారు. సంఘంలో టీచర్‌కుండే గౌరవం చాలా గొప్పది. ఈ యాంగిల్లో రాజేంద్ర ప్రసాద్ సరికొత్తగా కనిపిస్తారు. నేటి నుండి రెగ్యులర్ షూటింగ్‌కు ప్రారంభం అవుతుంది. సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. హైదరాబాద్, పాలకొల్లు, రాజోలు పరిసర ప్రాంతాలలో షూటింగ్ చేస్తామ’ని వివరించారు.
రఘుబాబు, చలపతిరావు, బెనర్జీ, రవి ప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, సంగీతం: కోటి, కెమెరా: హరి అనుమోలు, ఎడిటింగ్: గౌతంరాజు, కథ: తమ్ముడు సత్యం, నిర్మాత, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: క్రాంతి మాధవ్.