‘జయం’ రవి, కంగనా రనౌత్ జంటగా జీవా దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘ధామ్ ధూమ్’ చిత్రాన్ని జ్యోతి ఆర్ట్స్
పతాకంపై యం.వి. గోపాలరావు ‘రక్షకుడు’ పేరిట తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆదివారం జరిగిన ఈ చిత్రం ఆడియో
ఆవిష్కరణలో అతిథిగా పాల్గొన్న ఆర్.బి.చౌదరి సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - ‘‘ఈ
చిత్రహీరో ‘జయం’ రవి నాన్న ఎడిటర్ మోహన్‌తో నాకు మంచి అనుబంధం ఉంది.
తమిళంలో విజయం సాధించినట్లుగానే ఈ చిత్రం తెలుగులో కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను’’
అన్నారు. ‘‘జీవా హీరోగా మా సంస్థ నుంచి వచ్చిన’ ‘రంగం’ ఇటీవలే వంద రోజులు పూర్తి చేసుకుంది. శతదినోత్సవ
వేడుకను తిరుపతిలో ఈ నెల 28న జరపనున్నాం. ఇక ‘రక్షకుడు’ విషయానికొస్తే.. కళాశాల, పులివేట వంటి
విజయవంతమైన చిత్రాలను అందించిన గోపాలరావు ఈ చిత్రంతో మరో విజయాన్ని చవిచూస్తారు’’ అని అతిథులు ఎన్వీ
ప్రసాద్, పరాస్ జైన్ తెలిపారు.
రచయిత శశాంక్ వెన్నెలకంటి మాట్లాడుతూ - ‘‘ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇందులో ఓ క్యూట్ లవ్‌స్టోరీ కూడా ఉంది.
ఇంత మంచి సినిమాకి మాటలు రాయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. నిర్మాత యం.వి.గోపాలరావు మాట్లాడుతూ -
‘‘ఎన్నో ఆశలు పెట్టుకుని విదేశాలకు వెళ్లే మన భారతీయులకు అక్కడ ఏ విధమైన సమస్యలు ఎదురయ్యాయి అనేది ఈ
చిత్రం ప్రధానాంశం. రంజాన్ కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.