"ఏడాది కిందట నా జీవితంలోకి ఉపాసన ప్రవేశించింది. అప్పటి నుంచీ నా అభిరుచులను తను బాగా గుర్తించింది. నేను
షూటింగ్ బిజీలో ఉన్నా.. బిజినెస్, పోలో అన్నింటినీ ఉపాసన ముందుకు తీసుకెళుతోంది. థాంక్స్ టు ఉపాసన'' అని
చిరంజీవి తనయుడు, సినీ హీరో రామ్‌చరణ్ వ్యాఖ్యానించారు. తాను సొంతం చేసుకున్న ఆర్‌సీ హైదరాబాద్ పోలో టీమ్
గురించి శుక్రవారం సాయంత్రం తాజ్ కృష్ణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తమ పోలో టీమ్
కోసం టీ షర్టులను విడుదల చేశారు.
అనంతరం మాట్లాడుతూ.. "నాకు గుర్రాలంటే పిచ్చి. అదే ఇవాళ నన్ను పోలో టీమ్‌కు ఓనర్‌ని చేసింది. యువతకు, కాలేజీ
విద్యార్థులకు ఈ గేమ్‌ను విస్తృతంగా పరిచయం చేయాలనిపించింది'' అని చెప్పారు. ఐదేళ్ల కిందట తాను గుర్రపు స్వారీ
నేర్చుకున్నానని, అదే లేకపోతే పోలో లేదు.. మగధీర లేదని వివరించారు. అందుకు తన తండ్రి చిరంజీవికి ఆయన
ధన్యవాదాలు తెలిపారు. తమ టీమ్‌కు జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వచ్చాయని, శనివారం తమ టీమ్
హైదరాబాద్‌లో మ్యాచ్ ఆడుతుందని వివరించారు. 12న సీఎం కప్, 18న ఫైనల్స్ ఉంటాయని, ఢిల్లీలో, డిసెంబర్‌లో జైపూర్‌లో
అక్టోబర్‌లో జరిగే మ్యాచ్‌లలోనూ పాల్గొంటామని, మిగిలిన వివరాలను తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా
ఉపాసన గురించి ఆయన ప్రత్యేకంగా వివరించారు.
"నిశ్చితార్థం అయ్యేవరకు మేమిద్దరం కలిసి ఎక్కడా కనిపించం. కనిపిస్తే అది తెలుగు సంస్కృతి కాదు. కానీ పెళ్లి షాపింగ్
మాత్రం కలిసే చేస్తాం. ఈ మధ్యనే మా ఫ్రెండ్స్‌కు ట్రీట్ ఇచ్చాం. నాకు నాలుగు గుర్రాలుంటే.. తనకూ నాలుగు
గుర్రాలున్నాయి. ఇద్దరికీ స్పోర్ట్స్ కార్లంటే ఇష్టం. ఇలా మా ఇద్దరి అభిరుచులు కలిశాయి. తనతో ప్రేమలో పడ్డ ఏడాది
కాలంగా నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను. నవంబర్‌లో నిశ్చితార్థం ఉంటుంది. అప్పటికి 'రచ్చ' షూటింగ్ పూర్తవుతుంది.
జనవరిలో పెళ్లి ఉంటుంది. నిశ్చితార్థం తను కోరుకున్న ప్రదేశంలో జరగనుండడం ఆనందదాయకం. మా పెళ్లి కూడా
దోమకొండ గడీలోనే జరుగుతుంది'' అని వివరించారు. అపోలో మ్యూనిక్ తరఫున కూడా ఈ కార్యక్రమంలో తానే
పాల్గొంటున్నట్టు చరణ్ చమత్కరించారు.