Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
రామ్ చరణ్ - జెనీలియాల చిత్రం ‘మెగా’ ప్రారంభం
     అంజనా ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌చరణ్‌తేజ్‌ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో కె.నాగేంద్రబాబు నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం.7 హైద్రాబాద్‌లోని నోవోటెల్‌ హోటల్‌లో ఘనంగా ప్రారంభమైంది. ‘చిరుత’, ‘మగధీర’ చిత్రాల తర్వాత రామ్‌చరణ్‌ హ్యాట్రిక్‌ చిత్రానికి ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వం వహిస్తుండడం విశేషం. దర్శకుడిగా తాను హ్యాట్రిక్‌ సాధించడంతోపాటు, హీరోగా చరణ్‌కు ఈ చిత్రంతో హ్యాట్రిక్‌నివ్వవలసిన బాధ్యత తనమీద ఉందని పాత్రికేయుల సమావేశంలో భాస్కర్‌ వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గమనార్హం. దేవుళ్ల పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఢా. దాసరి నారాయణరావు క్లాప్‌ కొట్టగా, డాడి.రామానాయుడు కెమెరా స్విచాన్‌ చేసారు.

రామ్‌చరణ్‌తేజ్‌ తొలి, మలి చిత్రాల దర్శకులు పూరి జగన్నాథ్‌, రాజమౌళిలతోపాటు ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్‌, శ్రీనువైట్ల, మెహర్‌ రమేష్‌, సురేందర్‌రెడ్డి, హీరోలు వెంకటేష్‌, అల్లు అర్జున్‌ తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాభినందనలు తెలిపారు. చిరంజీవి-సురేఖ దంపతులు తమ తనయుడు రామ్‌చరణ్‌తేజ్‌కు ఆశీస్సులు అందజేసారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాత కె.నాగేంద్రబాబు, అల్లు అరవింద్‌, బొమ్మరిల్లు భాస్కర్‌, రామ్‌చరణ్‌, ఎక్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ మన్యం రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

నిర్మాత నాగేంద్రబాబు మాట్లాడుతూ ‘‘చరణ్‌ సూచన మేరకు భాస్కర్‌ దర్శకత్వంలో ఈ చిత్రానికి శ్రీకారం చుడుతున్నామని, తొలుత హైద్రాబాద్‌లో షెడ్యూల్‌ చేసి, అనంతరం ఆస్ట్రేలి యాలో మరో షెడ్యూల్‌ చేసి, తిరిగి హైద్రాబాద్‌లో ఇంకో షెడ్యూల్‌ చేయనున్నామని’’ అన్నారు. హీరో రామ్‌చరణ్‌తేజ్‌ మాట్లాడుతూ ‘‘మగధీర’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలోనే సినిమా చేయడం కరక్టని భావించానని’’ అన్నారు. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘‘మగధీర’ను మనసులో పెట్టుకోకుండా ఆ చిత్రాన్ని మరపించేవిధంగా ఈ చిత్రాన్ని రూపొందించేందుకు నాగబాబు సమాయత్తమ వుతు న్నారు, దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌పై ఈ గురుతరమైన బాధ్యతను ఉంచడం అభినందనీయం. భాస్కర్‌ ఈ బాధ్యతను సమర్థవంతంగా నిభాయిస్తాడనడంలో ఎంతమాత్రం సందేహం లేదు’’ అన్నారు.

రామ్‌చరణ్‌ సరసన జెనీలియా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ ప్రత్యేకపాత్రలో నటించనుంది. ఈ చిత్రానికి కెమెరా: కిరణ్‌రెడ్డి, మ్యూజిక్‌: హేరిస్‌ జైరాజ్‌, ఆర్ట్‌: ఆనంద్‌సాయి, స్టంట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, డైలాగ్స్‌: తోట ప్రసాద్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఎక్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మన్యం రమేష్‌, నిర్మాత: కె.నాగేంద్రబాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ‘బొమ్మరిల్లు’భాస్కర్‌.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com