ఫిలిం న్యూస్
 
 
 
 
అనుష్క 'రంపచోడవరం'
'అరుంధతి'గా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన అగ్రనటి అనుష్క ప్రధాన పాత్రలో మరో సంచలన చిత్రం ఆగస్ట్‌లో ప్రారంభం కాబోతోంది. గతంలో శ్రీరామదాసు వంటి అపురూప భక్తిరస చిత్రాన్ని నిర్మించి, ప్రస్తుతం పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, అనుష్క ప్రత్యేక పాత్రల్లో అందరూ బాలతారలతో అయిదు భాషల్లో క్రీస్తు చరిత్రను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత కొండ కృష్ణంరాజు శ్రీఆదిత్య ప్రొడక్షన్స్‌ పతాకంపై అనుష్క ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి 'రంపచోడవరం' టైటిల్‌ నిర్ణయించారు.

ఈ చిత్రం గురించి నిర్మాత కొండ కృష్ణంరాజు మాట్లాడుతూ - ''1930లో బ్రిటీష్‌ పాలనలో జరిగిన సంఘటనలతో ఈ కథను తీసుకోవడం జరిగింది. బ్రిటీష్‌ పాలకుల అరాచకాలపై ఒక యువకుల బృందంతో కలిసి గెరిల్లా యుద్ధం తరహాలో పోరాడిన సాహస వనిత కథ ఇది. అనుష్క కెరీర్‌లో ఇది మరో గొప్ప సంచలన చిత్రం అవుతుంది. మా సంస్థకు శ్రీరామదాసు, ఇప్పుడు తీస్తున్న జీసస్‌ క్రైస్ట్‌కి కథను అందించిన జె.కె.భారవిగారు ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. ఈ కథ వినగానే అనుష్క ఎంతో ఇన్‌స్పైర్‌ అయ్యారు. 'బాణం' వంటి ఉత్తమ చిత్రానికి దర్శకత్వం వహించిన యువ దర్శకుడు చైతన్య దంతులూరి ఈ కథకు పూర్తి న్యాయం చేస్తారనిపించి దర్శకత్వ బాధ్యతల్ని అప్పగించాం. ఈ పీరియాడికల్‌ మూవీకి కథకు తగినట్టుగా అద్భుతమైన సంగీతాన్ని కంపోజ్‌ చెయ్యడానికి మణిశర్మగారు విశేషంగా కృషి చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం కర్ణాటకలోని కూర్గ్‌లో షూటింగ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేశాం. భారీ తారాగణంతో, టాప్‌ టెక్నీషియన్స్‌తో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నాం'' అన్నారు.

ఈ చిత్రానికి కథ-మాటలు: జె.కె.భారవి, సంగీతం: మణిశర్మ, ఫోటోగ్రఫీ: అనిల్‌ భండారి, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, వేదవ్యాస, కాస్ట్యూమ్స్‌: పాయల్‌ సలూజా(ముంబాయి), ప్రొడక్షన్‌ డిజైనర్‌: భూపేష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శేషు, నిర్మాత: కొండ కృష్ణంరాజు, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: చైతన్య దంతులూరి.