'శిక్షణ తీసుకుంటే ఎవరైనా ఏదైనా చేయొచ్చు. నేను చెన్నయ్‌లో పుట్టి, పెరగడంవల్ల నా తెలుగు ఉచ్ఛారణ సరిగ్గా ఉండదు. కానీ హీరో అవ్వాలనుకున్న తర్వాత భాష గురించి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను' అంటూ మహానటుడు ఎన్టీఆర్ నటించిన 'దానవీరశూరకర్ణ'లోని ఓ భారీ డైలాగ్‌ను చక్కగా వినిపించారు 'లీడర్' హీరో రానా. ఫిల్మ్ న్యూస్ కేస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా శుక్రవారం సాయంత్రం 'లీడర్' రానాతో 'మీట్ ది ప్రెస్' ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో రానా పై విధంగా స్పందించారు.
మరికొన్ని మనోభావాలను పంచుకుంటూ - ''లీడర్ కథ ఎన్నుకోవడానికి ఒక కారణం ఉంది. మా తాతగారు రామానాయుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఓసారి ఆయన నియోకజవర్గానికి వెళ్లాను. అక్కడి ప్రజలు 'ఈరోజు మేం మంచినీళ్లు తాగుతున్నామంటే అందుకు కారకుడు మీ తాతగారే' అన్నారు. ఆ మాటలు వింటున్నప్పుడు నా కళ్లు చెమర్చాయి. కారణాలేమైనప్పటికీ తాతగారు రాజకీయాల నుంచి విరమించుకున్నారు. ఓ మంచి రాజకీయవేత్తగా నటించాలని శేఖర్ కమ్ముల నాకు ఈ కథ చెప్పగానే బాగా నచ్చింది. అందుకే చేశాను. ఇక నుంచి హీరోగా కొనసాగుతాను. ప్రస్తుతం హిందీలో 'దమ్ మారో దమ్' అనే చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రంలో నేను చేస్తున్న పాత్ర కోసం గిటార్‌లో శిక్షణ తీసుకుంటున్నాను. అలాగే నాకు పౌరాణిక చిత్రాల్లో నటించాలని ఉంది. నా శారీరక భాషకి అవి నప్పుతాయన్నది నా ఫీలింగ్'' అని రానా అన్నారు. నాగచైతన్య నటించిన 'ఏ మాయ చేసావె' గురించి చెబుతూ - 'నాకు బాగా నచ్చింది' అని అన్నారు.