యమ్.వి.ఎస్ క్రియేషన్స్ పతాకంపై అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో మచ్చా శ్రీనివాసరావు నిర్మిస్తున్న చారిత్రాత్మక చిత్రం
‘రత్నావళి’ రీ రికార్డింగ్ పూర్త చేసుకుంది. ‘మఫత్ లాల్ ఫ్యాబ్రిక్స్’ సమర్పిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం గ్రాఫిక్ వర్క్
జరుపుకుంటోంది.
‘రత్నావళి’ నిండు యవ్వనంలో వున్న కొత్త పెళ్లికూతురు. భర్త తులసీ దాస్ మహాకవి కావలసినవాడు. తొలి రాత్రి
నుండి భార్యే సర్వస్వంగా శారీరక వాంఛతో రగిలిపోతున్నాడు. క్షణిక - సుఖమే శాశ్వతపరమానందంగా భ్రమించాడు.
కళ్లు తెరిస్తే అందమైన స్త్రీ దేహం. కళ్లు మూస్తే ఆనందపు స్త్రీ సుఖం. భర్త పూర్తిగా తనకు దాసుడు కావడం ఎంతో
సంతోషాన్ని కలిగించినా క్రమక్రమంగా తన బాధ్యత తెలుసుకుంది.
అర్థరాత్రి ప్రళయ భీభత్సమైన వర్షంలో, పొంగిపొర్లుతున్న నదిని దాటుకుని, తన ‘పొందు’కోరి వచ్చిన భర్తను
తిరస్కరించింది. పామును తాడుగా భ్రమించి పైకి ఎగబాకి వచ్చిన భర్తను ఛీ కొట్టింది. ఆ పరిణామక్రమంలో రత్నావళి
- తులసీదాస్ దాంపత్య బంధం ఎలా మారిపోయింది? అతను ‘హనుమాన్ చాలీసా’, ‘రామచరితమానసం’ రచించిన
‘మహాభక్తకవి తులసీ దాసు’గా ఎలా ప్రసిద్ధికెక్కాడు? రామభక్తహనుమాన్ చూపిన మహిమలేమిటి?
కాశీవిశ్వేశ్వరుడు ఏ అద్భుత సన్నివేశంలో తులసీ దాసుని ‘మహాకవి’గా ప్రకటించాడు?
అద్భుత మహిమలు, ఊహకందని సన్నివేశాలు, పౌరాణిక చారిత్రక దృశ్యాల కల్పన - ఇవన్నీ గ్రాఫిక్స్
మాయాజాలంతో రూపుదిద్దుకుంటున్నాయి. కనువిందు చేసే రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ కు తోడుగా, కథతో
ఇమిడిపోయే అధునాతన గ్రాఫిక్ వర్క్ జరుపుకుంటోంది ‘రత్నావళి’. ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు ఈ గ్రాఫిక్ వర్క్
చేస్తున్నారు. త్వరలో ఈ చిత్రంలోని పాటలు విడుదల చేసి, ఫిబ్రవరి మూడవవారంలో చిత్రం విడుదల చేస్తామని -
నిర్మాత మచ్చా శ్రీనివాసరావు చెప్పారు.
తులసీ దాస్ గా సునీల్ శర్మ, రత్నావళిగా పూజా బలూటియా ఫ్రధానపాత్రలు పోషించిన ఈ చిత్రంలో కాశీరాజుగా
సుమన్, మీరాబాయిగా వాణీ విశ్వనాథ్, హనుమంతుడిగా విందూసింగ్, సూరదాసుగా ఏవిఎస్, వాల్మీకిగా
విజయచందర్, కె.రాజశేఖర్, వినయ్ వర్మ, ప్రియ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు - ప్రాజెక్ట్ డిజైనర్ -
కె.వీరేంద్ర, సంగీతం - శశిప్రీతం, ఫోటోగ్రఫీ - మధుమహంకాళి, ఎడిటింగ్ - కె.రవీంద్రబాబు, కొరియోగ్రఫీ - రమణ,
సమర్పణ - మఫత్ లాల్ ఫ్యాబ్రిక్స్, నిర్మాత - మచ్చా శ్రీనివాసరావు, రచన, దర్శకత్వం - అల్లాణి శ్రీధర్.