అరవింద్ కృష్ణ, సుప్రియా శైలజ జంటగా రాజ్ మదిరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రుషి’. ప్రసాద్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై
ఎ.రమేష్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్, లోగో ఆవిష్కరణ జరిగింది. దర్శకరత్న దాసరి నారాయణరావు విడుదల
చేశారు.
దాసరి మాట్లాడుతూ- ‘చాలా సంవత్సరాల తర్వాత ప్రసాద్ ప్రొడక్షన్స్ సంస్థ తెలుగులో చిన్నవారితో మంచి బడ్జెట్ చిత్రాన్ని నిర్మించి లోగోను
ఆవిష్కరించడం కొత్త విషయం. పెద్ద సంస్థలు చిన్న సినిమాలు చేయాలి. అప్పుడే పరిశ్రమ బాగుంటుంది. అప్పట్లో 10లక్షలు వేతనం తీసుకొనే
హీరోలు పత్రిష్టాత్మక సంస్థ అయిన ప్రసాద్ ప్రొడక్షన్స్ సినిమా అనేసరికి లక్ష రూపాయలకు నటించడానికైనా సరే అనేవారు. దేశంలో చలనచిత్ర
పరిశ్రమకి సంబంధించి ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా ప్రసాద్ సంస్థ వాటిని మన ఇండస్ట్రీకి పరిచయం చేసేవారు. నా దగ్గర పనిచేసిన 52వ దర్శకుడు
రాజ్ ఈ సినిమా దర్శకుడు రావడం నాకు సంతోషంగా వుంది. హీరో అరవింద్ మా ‘యంగ్ ఇండియా’ సినిమాలో నటించాడు. ఈ చిత్రం
విజయవంతం కావాలని కోరుకుంటున్నా’ అన్నారు.
మురళీమోహన్ మాట్లాడుతూ- ‘ఎల్వీ ప్రసాద్ చిత్రసీమలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పైకి వచ్చారు. ఆయన తెలుగు, తమిళ, హిందీ
భాషల్లో అద్భుతమైన సినిమాలు నిర్మించారు. వారి కుమారుడైన రమేష్ ప్రసాద్ ఈ సినిమా ఎప్పుడు ప్రారంభించారో, ఎప్పుడు పూర్తి చేశారో
తెలియదు. సడన్ గా నిన్న ఫోన్ చేసి ప్రివ్యూ వుంది రమ్మన్నారు. సినిమా చూశాను. చాలా అద్భుతంగా వుంది. ఈ సినిమాకి నంది అవార్డ్
తప్పకుండా వస్తుంది. యువత ఎవ్వరూ ఈ సినిమాను మిస్ కారు. మంచి చిత్రాన్ని తీసిన రమేష్ ప్రసాద్ తండ్రికి తగ్గ తనయుడు
అనిపించుకున్నార’ని అన్నారు.
రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ-‘20సంవత్సరాల తర్వాత మా సంస్థలో మళ్ళీ సినిమా నిర్మించడం ఆనందంగా వుంది. దర్శకుడు ఈ కథ
చెప్పిన తీరు బాగానచ్చింది. మంచి సబ్జెక్ట్. ఎక్కడా వెనుకాడకుండా చిత్రీకరించాము. తప్పకుండా ఈ చిత్రానికి ప్రేక్షాదరణ లభిస్తుంది’ అన్నారు.
దర్శకుడు రాజ్ మదిరాజు మాట్లాడుతూ- ‘సి.నారాయణరెడ్డిగారు వైద్యుల గురించి రాసిన ఒక కవిత స్ఫూర్తితో ఈ సినిమాని చేశాను. ఈ
సినిమాలో శేఖర్ అనే పాత్ర మీద సినిమా మొత్తం ఆధారపడి వుంటుంది’ అన్నారు.