ఫిలిం న్యూస్
 
 
 
 
మానవ సంబంధాల 'సంద్రం'

కోస్తా తీరం వెంబడి జీవించే ప్రజలవారి జీవితంలో సముద్రం కూడా ఓ భాగమే. వారి జీవనం సుముద్రంపై ఆధారపడి ఉంటుంది. అందుకే వారంతా సముద్రాన్ని దేవుడిగా కొలుస్తారు. ఇలాంటి వాతావరణంలో ఉండే వ్యక్తుల మానవ సంబంధాలను ప్రధానాంశంగా చేసుకొని వస్తున్న చిత్రం 'సంద్రం'. షూటింగ్‌ పూర్తయి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం, లోగో ఆవిష్కరణ గురువారం జరిగింది. కుమార్‌ రాజు దర్శకత్వంలో రాజేష్‌ తెన్నేటి నిర్మిస్తున్నారు. సీనియర్‌ జర్నలిస్టు బి.ఎ.రాజు లోగోను ఆవిష్కరించారు. అనంతరం ఈ చిత్రంలో పాటలు పాడిన శ్రీలేఖ పుట్టినరోజు కేక్‌ను కట్‌ చేశారు. ఆ తర్వాత బి.ఎ.రాజు మాట్లాడుతూ...'ఇందులో నాగు రాసిన పాటలు బాగున్నాయి. ప్రతి పాత్రా డెప్త్‌గా ఉంది. మా అన్నయ్యగారి అబ్బాయి దుర్గా కిషోర్‌ పొటోగ్రఫీ అందించారు. చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా'నని అన్నారు.

శ్రీలేఖ మాట్లాడుతూ...'మూడు పాటలు పాడాను. చాలా ఫీల్‌ ఉన్న పాటలవి. నాగులో మంచి టాలెంట్‌ ఉంది. క్రిష్‌ చక్కటి సంగీతాన్ని అందించారు. లోగో చాలా వైవిధ్యంగా ఉంది. సినిమాకూడా అలానే ఉంటుంది' అన్నారు. హీరో అర్జున్‌ మాట్లాడుతూ...'ఇంతకుముందు చిన్న చిన్న పాత్రలు వేసేవాడిని. హీరోగా అవకాశం కల్పించిన నిర్మాత దర్శకులకు రుణపడి ఉంటా'నని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ...'సంద్రం అనేది వికృతి శబ్దం. కథలో ప్రధానంగా మానవ సంబంధాలుంటాయి. దాన్ని అందరికీ తెలియజేయాలనే తీశాం. మాటలు కూడా నేనే రాశాను. నిర్మాత ఎంతో సహకరించారు. త్వరలో విడుదల కానుంది' అని తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ...'మాది తొలి ప్రయత్నం. షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఆడియో, సినిమా విడుదల చేయనున్నా'మని తెలిపారు.

గీత రచయిత నాగు మాట్లాడుతూ...'సంద్రం దర్శకుడు నామీద నమ్మకంతో అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చారు. ఇందులో ఐదు పాటలున్నాయి. ఒక్కోపాటకు ఒక్కో నేపథ్యముంటుంది. సినీ జర్నలిస్టు నుంచి గీతరచయితగా ఎదిగినవారి బాటలో పయనించాలనుకుంటున్నా'నని అన్నారు. అర్జున్‌, దీపిక జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: క్రిష్‌, కెమెరా: బి. దుర్గా కిషోర్‌, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కుమార్‌ రాజు ముదునూరి.