‘‘నిత్యజీవితంలో మనం ఎన్నో సంఘర్షణలను ఎదుర్కొంటాం. అలా నలుగురు వ్యక్తులు ఎదుర్కొనే సంఘర్షణే ఈ చిత్రం. ఇది సీరియస్
సినిమా కాదు. వినోదం కూడా ఉంటుంది. సముద్రఖనితో ‘శంభో శివ శంభో’ చేస్తున్న సమయంలో తమిళ్ వచ్చు కదా.. తమిళ్
సినిమా చేస్తావా? అని అడిగారు. ఆ సమయంలోనే శశికుమార్, నన్ను కలిపి ఫొటోలు కూడా తీశారు. ఆ తర్వాత ఈ చిత్రం
ఆరంభమైంది’’ అని ‘అల్లరి’ నరేష్ అన్నారు.
ఆయన, శశికుమార్, స్వాతి, నివేద కాంబినేషన్‌లో తమిళంలో రూపొందుతున్న ‘పొరాళి’ చిత్రాన్ని తెలుగులో కేఎల్ దామోదర్‌ప్రసాద్
సమర్పణలో వేదరాజు టింబర్ ‘సంఘర్షణ’ పేరిట విడుదల చేస్తున్నారు. ఈ చిత్రవిశేషాలు తెలియజేయడానికి ఆదివారం హైదరాబాద్‌లో
ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరేష్ పై విధంగా స్పందించారు. ‘శంభో శివ శంభో’ తర్వాత చేస్తున్న చిత్రం ఇదని, ఈ చిత్రం
కూడా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని సముద్రఖని అన్నారు.
ఒక మంచి చిత్రం ఇవ్వడానికి కృషి చేశామని శశికుమార్ తెలిపారు. ఇలాంటి మంచి చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉందని
నివేద చెప్పారు. త్వరలో ఆడియోను, డిసెంబర్‌లో సినిమాని విడుదల చేస్తామని దామోదర్‌ప్రసాద్, టింబర్ చెప్పారు. ఈ సమావేశంలో
ఇంకా వివేకానంద కూచిభొట్ల, అమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు.