దర్శకుడు ఎన్.శంకర్ త్వరలో ఓ చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజల భావావేశాల నేపథ్యంలో వర్తమాన సామాజిక, రాజకీయ అంశాలను స్పృశిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తానని ఎన్.శంకర్ చెప్పారు. ఆయన ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు చెబుతూ -"నేను గతంలో చేసిన చిత్రాలన్నీ ఏదో ఒక నేపథ్యంతో రూపొందినవే.
తెలంగాణ లోని కన్న తల్లుల కడుపు కోతకు నిలువుటద్దంగా 'ఎన్‌కౌంటర్' తీశాను. రాయలసీమలోని వాస్తవిక అంశాలకు ప్రతిబింబంగా 'శ్రీరాములయ్య' రూపొందించాను. యమలోకం గురించి ఎంతో పరిశీలన చేసి 'యమజాతకుడు', జ్యోతీరావు పూలే స్ఫూర్తితో 'జయం మనదేరా', గోదావరిలాంటి మనసున్న ఓ అమాయకుడి కథా నేపథ్యంలో 'భద్రాచలం', పేద ప్రజల తిరుగుబాటును ఆవిష్కరిస్తూ 'ఆయుధం', సమసమాజస్థాపనను ఆకాంక్షిస్తూ 'రామ్' చిత్రాలు రూపొందించాను.
ఇక ఈ సినిమాలో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అంశాలకు పెద్దపీట వేస్తున్నాను. నిజాం సాయుధ పోరాటానికి సంబంధించిన అంశాలను కూడా ఇందులో చూపబోతున్నాను. స్నేహితుల సహకారంతో నేనే సొంతంగా ఈ సినిమా తీస్తున్నాను. హీరో హీరోయిన్ మొదలుకుని మొత్తం సినిమాలో కనిపించే 64 పాత్రలకు కొత్త వారినే ఎంచుకోబోతున్నాను. ఇందుకోసం త్వరలో స్టార్‌హంట్ నిర్వహించబోతున్నార . మే రెండోవారంలో చిత్రీకరణ మొదలుపెడతాం' అన్నారు.