ఫిలిం న్యూస్
 
 
 
 
థ్రిల్లర్ 'సశేషం'

క్లాప్‌బోర్డ్ స్టూడియోస్ పతాకంపై స్వీయ నిర్మాణంలో శ్రీకిశోర్ రూపొందిస్తున్న చిత్రం హారర్ సినిమా 'సశేషం'. విక్రమ్ శేఖర్, సుప్రియ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని దొడ్డపనేని మురళీకృష్ణ సమర్పిస్తున్నారు. మంగళవారం ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను 'ఇట్స్ మై లవ్‌స్టోరి' దర్శకుడు మధుర శ్రీధర్ ఆవిష్కరించగా, వెబ్‌సైట్‌ను నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ ప్రారంభించారు. ఈ సినిమా ట్రైలర్, సంగీతం బాగున్నాయనీ, కొత్త పాయింట్‌తో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా ఆడుతుందనే నమ్మకం ఉందనీ వారు చెప్పారు.

అందరం కొత్తవాళ్లం కలిసి రెండు నెలల పాటు ఈ చిత్రం కోసం శ్రమించామనీ, దర్శకుడు మంచి కమాండింగ్‌తో ఈ సినిమాని రూపొందించారనీ హీరో విక్రమ్ శేఖర్ అన్నారు. చిత్రంలో నాలుగు పాటలున్నాయని సంగీత దర్శకుడు కె.సి. మౌళి తెలుపగా, పాటలన్నీ కథాగమనానికి అనుగుణంగా ఉంటాయని గేయ రచయిత సదాచంద్ర చెప్పారు. దర్శకుడు శ్రీకిశోర్ మాట్లాడుతూ "అందరం యువకులం కలిసి ఈ సినిమా చేశాం. ప్రస్తుతం రీరికార్డింగ్, డీఐ జరుగుతున్నాయి. ఇందులో మైకా బెహరమ్ అనే జర్మనీ డాన్సర్‌పై ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించాం. ఈ పాట సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది'' అని తెలిపారు.

హాసిని. బేబి పూజిత, సత్యం రాజేశ్, భాస్కర్‌రావు, బాబి, జగదీశ్వరి తారాగణమైన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే: బాలాజీ సానల, మాటలు: అనిల్ చోడిశెట్టి, ఛాయాగ్రహణం: సతీశ్, కూర్పు: మధు, వంశీ రావి, కళ: మోల్గూరి శ్రీను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సిరాజ్ అహ్మద్, సహ నిర్మాతలు: దొడ్డపనేని వెంకటేశ్వరరావు, దొడ్డపనేని రామారావు.